
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్‌అర్బన్: మైనారిటీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ అన్నారు. నిజామాబాద్ నగరానికి మంగళవారం ఆయన విచ్చేయగా, వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితోపాటు ఇతర జిల్లాల అధికారులతో భేటీ అయ్యారు. జిల్లాలో మైనారిటీ వర్గాల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్సారీ మాట్లాడుతూ.. మైనారిటీల కోసం ఉద్దేశించిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గరించి అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అనంతరం మైనారిటీ వర్గాల నుంచి కమిషన్ చైర్మన్ వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.