నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని దేవాదాయ ధర్మాదాయశాఖ జిల్లా కార్యాలయంలో మంగళవానం ధూపదీప నైవేద్యం పథకానికి వచ్చిన అర్జీలను జిల్లా ఎండోమెంట్ సహయ కమిషనర్ విజయ రామరావు పరిశీలించారు. నాలుగు రోజులలో అర్చకులకు మౌఖిక పరీక్ష నిర్వహించి నివేదిక ఇవ్వవలసినదిగా కార్యనిర్వాహణాధికారులకు, పరిశీలకులకు, విజయ రామారావు సూచించారు. మొత్తం 97 అర్జీలను పరిశీలించాలని ఆయన కోరారు. జిల్లాలోని వివిధ ఆలయాలకు చెందిన కార్యనిర్వహణ అధికారులు పాల్గొన్నారు.
తప్పిన పెను ప్రమాదం
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో ఉదయం విద్యుత్ సరఫరా అవుతున్న కరెంట్ తీగలు ఒక్కసారిగా తెగి రోడ్డుపై పడ్డాయి. వెంటనే ఓ వాహనదారుడు గమనించి అటుపక్క ఎటువంటి వాహనాలు రాకుండా అడ్డుకున్నాడు. అనంతరం స్థానిక లైన్‌మన్ సంతోష్‌నాయక్‌కు సమాచారం అందించడంతో అతడు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. అనంతరం లైన్‌మన్ విద్యుత్ తీగలు సరిచేసి విద్యుత్ సరఫరా చేశారు. చెట్టు కొమ్మలు కరెంట్ తీగలపై పడటంతో తెగిపడ్డాయని విద్యుత్ సిబ్బంది తెలిపారు.
యాదవులపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష
● యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్ యాదవ్
నిజామాబాద్‌నాగారం: గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ పార్టీ యాదవ కులస్తులను అణిచివేస్తుందని, ప్రభుత్వం వివక్ష చూపుతుందని రాష్ట్ర యాదవ సంఘం బీసీ జనసభ అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ విమర్శించారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి యాదవులను, మున్నూరు కాపులను ఇతర కులాలను అణిచివేస్తుందన్నారు. బీసీలను అణగదొక్కడమే సామాజిక న్యాయమా అంటూ ఆయన ప్రశ్నించారు.
మంత్రివర్గంలో, కార్పొరేషన్స్‌లో, పార్టీ పదవుల్లో యాదవులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పడానికి నిరసనగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఈనెల 30న మహా ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ధర్నాకు యాదవ కులస్తులు భారీగా తరలిరావాలన్నారు. అనంతరం ధర్నా వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, కన్వీనర్ బాపూరావు యాదవ్, సంఘ ప్రతినిధులు రాజన్న యాదవ్, జనార్ధన్ యాదవ్, లింగన్న యాదవ్ పాల్గొన్నారు.

ధూపదీప నైవేద్య దరఖాస్తుల పరిశీలన