మోపాల్: యాసంగిలో వరి సహా ఇతర పంటలకు నీరందక ఎండిపోతున్నాయని, ఎండిపోయిన పంటకు ఎకరాకు రూ.30వేల నష్టపరిహారం రైతులకు ఇవ్వాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఎండిన వరి పొలాలను ఏఐకేఎంఎస్ బృందం పరిశీలించింది. అనంతరం తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్‌ఐ రాజేశ్వర్‌కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ.. రైతులు అప్పులు చేసి వరి, మొక్కజొన్న పంటలను సాగు చేశారని, తీరా పంట చేతికొచ్చే సమయంలో నీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నారు. ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. ఎండుతున్న పంటలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ఎండిపోయిన పంటలకు రూ.30 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల పాపయ్య, దేశెట్టి సాయిరెడ్డి, అగ్గు ఎర్రన్న, అగ్గు చిన్నయ్య, బండమీది నర్సయ్య, గంగాధర్, ప్రకాశ్, అబ్బయ్య, ఎల్లయ్య, మహేశ్, గణేశ్, వినోద్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.