ఇకపై నేనే పర్యవేక్షిస్తా!

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలను ఇకపై తానే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ప్రియాంకాగాంధీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టత, నేతల మధ్య సమన్వయం వంటి అంశాలపై ప్రతినెలా చివరివారంలో సమీక్షలు నిర్వహిస్తాననే సంకేతాలు పంపినట్లుగా తెలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా వ్యవహారం అనంతరం తలెత్తిన పరిస్థితులు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలపై వరుసగా నేతల నుంచి వస్తున్న ఫిర్యాదులు, సీనియర్ నేతల అసంతృప్తి తదితర అంశాలపై ప్రియాంకాగాంధీ గురువారం ఏఐసీసీ కార్యదర్శులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సహాయకులు బోసురాజు, రోహిత్ చౌదరీ, నదీమ్ జావెద్‌లతో తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. సుమారు గంటన్నరపాటు తెలంగాణ పార్టీ వ్యవహారాలపై చర్చించారు. ఇటీవల కాంగ్రెస్ నేతలతో జరిపిన చర్చల్లో వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై కూడా మాట్లాడుకున్నారు.
విభేదాల పరిష్కార బాధ్యత తీసుకోండి
ఈ సందర్భంగా రాష్ట్ర నేతల్లో నెలకొన్న సమన్వయలోపంపై ఎక్కువగా వచ్చిన ఫిర్యాదుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ప్రియాంక, వీటిని సరిదిద్దే చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రస్థాయి విభేదాలను అక్కడే పరిష్కరించేలా చూడాలని, అలా పరిష్కారం కాని వాటిని తన దృష్టికి తేవాలని ఆమె సూచించినట్లుగా చెబుతున్నారు. ఎక్కడ నేతల మధ్య విభేదాలు తలెత్తినా వారితో మాట్లాడాలని, బహిరంగ వేదికలపై విమర్శలకు దిగకుండా చూడాలని సూచించారు. ఇప్పటికే కార్యదర్శులకు పని విభజన పూర్తయినందున ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీని పటిష్టం చేయాలని సూచించినట్టుగా తెలిసింది. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అక్కడ ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేయాలని చెప్పినట్టుగా సమాచారం. రాష్ట్ర పార్టీకి సంబంధించి ఏ విషయాన్నైనా తనతో నేరుగా మాట్లాడాలని, రాష్ట్ర ముఖ్యనేతలతో తనూ నిత్యం టచ్‌లో ఉంటానని ఆమె తెలిపినట్లుగా ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.