మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో భర్త మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో ఓ మహిళ అతడిని ఫాలో అయ్యి హోటల్‌కు వెళ్లింది. అక్కడ భర్తను మరో మహిళతో కలిసి గదిలో గుర్తించిన ఆమె ఆగ్రహంతో ఇద్దరిపైనా పలుసార్లు చేయి చేసుకుంది. దీంతో హోటల్‌లో గందరగోళం నెలకొనగా.. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
జబల్‌పూర్‌కు చెందిన సవితా యాదవ్‌కు తన భర్త అరుణ్ యాదవ్, జ్యోతి కోరీకు సుమారు ఏడాది కాలంగా సన్నిహిత సంబంధం ఉందన్న అనుమానం ఉంది. ఈ క్రమంలో భర్త ఫోన్‌లోని సందేశాలను పరిశీలించగా.. వారిద్దరూ హోటల్‌లో కలుసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సూచించే చాట్స్ కనిపించినట్లు ఆమె తెలిపింది.
దీంతో సవిత తన భర్తను ఫాలో అవుతూ హోటల్‌కు వెళ్లింది. అక్కడ ఓ గదిలో అరుణ్, జ్యోతి కలిసి ఉండటాన్ని గుర్తించింది. గది తలుపు తెరిపించి వారిద్దరినీ చూసిన వెంటనే ఆమె ఆగ్రహానికి గురైంది. ఈ క్రమంలో భర్తతో పాటు అతడి ప్రియురాలితో వాగ్వాదానికి దిగింది. అనంతరం ఇద్దరినీ పలుసార్లు చెంపదెబ్బలు కొట్టింది. పోలీసులు ఇరువర్గాలను వేరు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
భర్తపై భార్య మరో ఆరోపణ
తన భర్తకు, జ్యోతికి చాలాకాలంగా సంబంధం ఉందని సవిత ఆరోపించింది. మరో మహిళకు దగ్గరవుతున్న కారణంగా తన భర్త తనకు దూరంగా ఉంటున్నాడని ఆమె పేర్కొంది. అంతేకాకుండా, జ్యోతి తన భర్తను బెదిరించి డబ్బులు లేదా ఇతర ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తోందని కూడా ఆరోపించింది.


