Constitution Day: ప్రజల చెంతకు కోర్టులు: సీజేఐ

Constitution Day: Courts have to reach out to people: CJI Chandrachud - Sakshi

వ్యాజ్యప్రక్రియను మరింత సులభతరం చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం చాలా ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. ‘‘అపార వైవిధ్యానికి నిలయమైన భారత్‌ వంటి అతి పెద్ద దేశంలో న్యాయమందించే వ్యవస్థ ప్రతి పౌరునికీ అందుబాటులో ఉండేలా చూడటమే అతి పెద్ద సవాలు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపట్టడంతో పాటు అధునాతన టెక్నాలజీని మరింతగా వాడుకోవాలి.

న్యాయం కోసం ప్రజలు కోర్టు మెట్లెక్కడం కాదు, కోర్టులే వారి చెంతకు చేరే రోజు రావాలి. ఈ దిశగా టెక్నాలజీని న్యాయవ్యవస్థ మరింతగా అందిపుచ్చుకుంటోంది. తద్వారా పనితీరును మరింతగా మెరుగు పరుచుకునేలా కోర్టులను తీర్చిదిద్దుతున్నాం’’ అని వివరించారు. ప్రధాని ప్రారంభించిన ఇ–సైట్లే అందుకు నిదర్శనమన్నారు. ‘‘ఉదాహరణకు నేషనల్‌ జ్యుడీషియల్‌ డేటా గ్రిడ్‌లోని సమాచారం వర్చువల్‌ జస్టిస్‌ క్లాక్‌ ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. జస్ట్‌ఈజ్‌ మొబైల్‌ యాప్‌ 2.0 ద్వారా జిల్లా జడ్జిలు తమ కోర్టుల్లో పెండింగ్‌ కేసులు తదితరాలన్నింటినీ నిరంతరం మొబైల్లో పర్యవేక్షించగలరు’’ అని చెప్పారు. హైబ్రిడ్‌ విధానం ద్వారా సుప్రీంకోర్టు విచారణలో లాయర్లు దేశంలో ఎక్కడినుంచైనా పాల్గొంటున్నారని గుర్తు చేశారు.

జడ్జిలపై గురుతర బాధ్యత
ప్రజలందరికీ స్వేచ్ఛ, న్యాయం, సమానత్వాలు అందేలా చూడాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యత జిల్లా జడ్జి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాకా అందరిపైనా ఉందని సీజేఐ అన్నారు. ‘‘ఇది జరగాలంటే న్యాయమూర్తులమంతా మన పనితీరును, మనలో పాతుకుపోయిన దురభిప్రాయాలు, తప్పుడు భావజాలాలను ఎప్పటికప్పుడు ఆత్మశోధన చేసుకుంటుండాలి. భిన్న నేపథ్యాల వ్యక్తుల జీవితానుభవాలకు సంబంధించిన భిన్న దృక్కోణాలను అర్థం చేసుకోనిదే మన పాత్రను సమర్థంగా నిర్వహించలేం’’ అన్నారు.

జిల్లా న్యాయ వ్యవస్థది కీలకపాత్ర
న్యాయం కోసం ప్రజలు తొలుత ఆశ్రయించేది జిల్లా న్యాయవ్యవస్థనేనని సీజేఐ గుర్తు చేశారు. ‘‘అందుకే ఆ వ్యవస్థను బలోపేతం చేయడం, అవసరమైన అన్నిరకాల సాయమూ అందించడం అత్యవసరం. ఉన్నత న్యాయవ్యవస్థకు మితిమీరిన విధేయత చూపే భావజాలం నుంచి జిల్లా న్యాయవ్యవస్థను బయటికి తేవడం చాలా అవసరం’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘భిన్న రంగాల వ్యక్తుల తాలూకు అనుభవాన్ని ఒడిసిపట్టి న్యాయవ్యవస్థలో భాగంగా మార్చడం చాలా ముఖ్యం. ఇందుకోసం న్యాయ వృత్తిలో అణగారిన వర్గాలు, మహిళల ప్రాతినిధ్యం మరింత పెరిగేలా చూడటం చాలా అవసరం’’ అని సూచించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top