ఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాజకీయాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రజా సమస్యలను పరిష్కరించకుండా రాజకీయంగా పరస్పరం విమర్శించుకుంటున్నారని మండిపడ్డారు. ఇద్దరు నేతలూ అసలు సమస్యలను పక్కనపెట్టి రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ఇండియా టుడేతో ప్రత్యేకంగా మాట్లాడిన ఒవైసీ.. సంభాల్‌లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారీ అవినీతి వ్యవహారంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. ఈ అంశంపై యోగి ప్రభుత్వాన్ని, అఖిలేశ్ యాదవ్‌ను ప్రశ్నిస్తూ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంభాల్ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. అక్కడ ఆయనను ఓడించి చూపిస్తామని వ్యాఖ్యానించారు. అఖిలేశ్ యాదవ్ గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేయాలని కూడా సవాల్ చేశారు.
అఖిలేశ్ యాదవ్ అభ్యర్థుల ఎంపిక, రాజకీయ పొత్తులపైనా ఒవైసీ విమర్శలు గుప్పించారు. అధికార పక్షానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు టికెట్లు ఇవ్వడంపై ప్రశ్నలు లేవనెత్తారు. సమాజ్‌వాదీ పార్టీ రాజకీయ వైఖరిని తప్పుబట్టారు. ఇక ఇండియా కూటమిలో ఎంఐఎం చేరికపై జరుగుతున్న చర్చలపైనా ఒవైసీ స్పందించారు. తమ పార్టీ సమానత్వం, ఆత్మగౌరవం కోసం మాట్లాడుతుందని స్పష్టం చేశారు. సరైన సంప్రదింపులు, గౌరవప్రదమైన భాగస్వామ్యం లేకుండా ఎవరి వెనుకా నిలబడే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన పార్టీలపై ఒవైసీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి.
ఇదీ చదవండి: కాసేపట్లో కాంగ్రెస్ మార్చ్.. ప్రతిపక్ష నేతలను కలవలేను: సీజేఐ


