
ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించండి
నారాయణపేట: ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం త్వరగా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కేసులను పోలీసు అధికారులు సీరియస్‌గా తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ప్రతి మూడు నెలలకోసారి జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతినెలా చివరి సోమవారం గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించి.. ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇదిలా ఉంటే, 2023లో 32 కేసులు నమోదు కాగా.. 16 కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 2024లో 34 కేసులకు గాను ఒక కేసుకు మాత్రమే నష్టపరిహారం చెల్లించినట్లు వివరించారు. ఈ సంవత్సరం 10 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఎస్పీ లింగయ్య, షెడూ్‌య్‌ల్డ్ కులాలు, తెగల అభివృద్ధిశాఖ అధికారి ఉమాపతి, డీఎంహెచ్‌ఓ జయచంద్రమోహన్, డీఏఓ జాన్ సుధాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఖలీల్, డీపీఓ బిక్షపతి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జనార్దన్, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్, తహసిల్దార్ అమరేంద్రకృష్ణ తదితరులు ఉన్నారు.
● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 11వ వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి హౌసింగ్ అధికారులు వేసిన మార్కింగ్‌ను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలను ప్రారంభించాలని సూచించారు. ఇంటి నిర్మాణాన్ని మధ్యలో ఆపకుండా, ఆలస్యం చేయకుండా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల గ్రౌండింగ్ పూర్తిచేసేందుకు మున్సిపల్, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కాగా, 11వ వార్డులో తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్.. మున్సిపల్ కమిషనర్‌ను పిలిచి వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ శంకర్ నాయక్ ఉన్నారు.
ప్రతి మూడు నెలలకోసారి విజిలెన్స్ కమిటీ సమావేశం తప్పనిసరి
కలెక్టర్ సిక్తా పట్నాయక్