
బంధువుల దశదిన కర్మకు వెళ్లొస్తుండగా..
కట్టంగూర్: బంధువుల దశదిన కర్మకు ద్విచక్ర వాహనంపై వెళ్లొస్తున్న తల్లీకుమారుడు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టి మృతి చెందారు. ఈ ఘటన కట్టంగూర్ మండలం కేంద్రం శివారులో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మన్సూరాబాద్‌కు చెందిన పిట్టల శంకరమ్మ(41), ఆమె కుమారుడు పిట్టల రజనీకాంత్(25) తమ బంధువుల దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ద్విచక్ర వాహనంపై నకిరేకల్ మండలం ఓగోడు గ్రామానికి వచ్చారు. సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా.. బయలుదేరారు. మార్గమధ్యలో కట్టంగూర్ మండల కేంద్రం శివారులోకి విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రజనీకాంత్ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన శంకరమ్మను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతుల స్వగ్రామం శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామం కాగా.. వీరు బతుకుదెరువు నిమిత్తం 30 సంవత్సరాల క్రితమే హైదరాబాద్‌కు వలస వెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మునుగోటి రవీందర్ తెలిపారు.
నిర్లక్ష్యంగా లారీని నిలిపిన డ్రైవర్..
లారీ డ్రైవర్ ఎలాంటి సిగ్నల్ లైట్లు వేయకుండా కట్టంగూర్ మండల కేంద్రం శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీని ఆపి సుమారు రెండు గంటల పాటు నిద్రించాడు. లారీని పూర్తిగా హైవే కిందకు దించకుండా సగ భాగం హైవే పైనే నిలుపడంతో.. రజనీకాంత్ లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో వెనుక నుంచి మరో వాహనం రావడంతో లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తల్లీకుమారుడు ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు తీవ్రగాయాలై మృతి చెందారు.
ఫ రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి
ఫ కట్టంగూర్ మండల కేంద్రం
శివారులో ఘటన