రాచ కొండపై ఆశలు | Sakshi
Sakshi News home page

రాచ కొండపై ఆశలు

Published Mon, Mar 25 2024 1:30 AM

రాచకొండలో ప్రకృతి అందాలు - Sakshi

సంస్థాన్‌ నారాయణపురం : ఘనమైన చరిత్ర కలిగి, రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న రాచకొండ ప్రాంత అభివృద్ధికి అడుగులు పడడం లేదు. ఫిలిం సిటీ, స్పోర్ట్స్‌ సిటీ, నెమళ్ల పార్కు, రోప్‌వే వంటివి ఏర్పాటు చేసి రాచకొండకు పూర్వ వైభవం తీసుకొస్తామని నాటి సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. రాచకొండను హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌ తరహాలో అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో మళ్లీ ఆశలు రేకెత్తుతున్నాయి.

35వేల ఎకరాల్లో విస్తరించిన రాచకొండ

రాచకొండ ఏడు శతాబ్దాల క్రితం తెలంగాణ ప్రాంతానికి రాజధాని. రాచర్ల పద్మనాయకులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసకొని పాలన సాగించారు. యాద్రాది, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో సంస్థాన్‌ నారాయణపురం మండల పరిధిలో 35 వేల ఎకరాల్లో రాచకొండ ప్రాంతం విస్తరించి ఉంది. హైదరాబాద్‌కు 40 కి.మీ, శంషాబాద్‌ విమానాశ్రయానికి కేవలం 25 కి.మీటర్ల దూరంలోనే ఉంటుంది. అయినా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వరకు రాచకొండ అభివృద్ధికి అనేక ప్రతిపాదనలు చేసినా ఏ ఒక్కటీ కార్యరూపందాల్చలేదు.

అభివృద్ధి కోసం ప్రతిపాదనలు

ప్రకృతి రమణీయత, చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాలకు పెట్టింది పేరు.. రాచకొండ ప్రాంతం. నాటి సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే చేసి రాచకొండ ప్రాంతాన్ని పరిశీలించారు. రాచకొండలో నెమళ్ల పార్కు, టెంపుల్‌ సిటీ, స్పోర్ట్స్‌ సిటీ, ఐటీ పార్కు, కృషి విజ్ఞాన కేంద్రం, ట్రెక్కింగ్‌, రోప్‌వే, ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ వంటి ప్రతిపాదనలు చేశారు. వీటితో పాటు రెండు వేల ఎకరాల్లో ఫిలిం సిటీ ఏర్పాటు, హైదరాబాద్‌ నుంచి, శంషాబాద్‌ నుంచి, హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి నుంచి నాలుగు లేన్ల రోడ్లు నిర్మించాలని ప్రతిపాదనలు చేసినా ఒక్కటీ అమలు కాలేదు. మెట్లబావికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు జిల్లా కలెక్టర్‌గా పని చేసి వెళ్లిన పమేలా సత్పతి ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సహకారంతో బావి అభివృద్ధికి చర్యలు చేపట్టినా పూడిక తీయడంతోనే నిలిచిపోయింది.

అభివృద్ధిపై ఇటీవల ప్రస్తావించిన సీఎం రేవంత్‌రెడ్డి

గత ప్రభుత్వ హయాంలో ఫిలిం సిటీ,

టెంపుల్‌ సిటీ, స్పోర్ట్స్‌ సిటీ వంటి

ప్రతిపాదనలు

కార్యరూపం దాల్చని నాటి సీఎం హామీలు

రేవంత్‌ ప్రకటనతో ఈ ప్రాంత

అభివృద్ధిపై మళ్లీ చర్చ

ఏం అభివృద్ధి జరిగిందంటే..

రాచకొండ ప్రాధాన్యతను వెలుగులోకి తీసుకురావడానికి దేశంలోనే రెండవ అతిపెద్ద సైబరాబాద్‌ ఈస్ట్‌ కమిషనరేట్‌కు అప్పటి ప్రభుత్వం రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌గా నామకరణం చేసింది.

ఆటవీ శాఖ నిధులు రూ.80 లక్షలతో వ్యూ పాయింట్‌, ప్రధాన ద్వారం వద్ద ప్రవేశ రుసుం కౌంటర్లు ఏర్పాటు.

దర్గా నుంచి రాచకొండ కోట వరకు రోడ్డు నిర్మాణం, చెరువుల మరమ్మతులు.

వివిధ రకాల పూలు, గడ్డి జాతి మొక్కలతో పాటు విభిన్న రకాల వృక్షాలు పెంపకం.

అప్పటి రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ ఇన్ఫోసిస్‌ కంపెనీ సహకారంతో రూ.10లక్షలతో సైన్‌ బోర్డుల ఏర్పాటుతో పాటు వివిధ పనులు.

రాచప్ప సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో శ్రీలక్ష్మినర్సింహస్వామి ఆలయం పునరుద్ధరణ.

శివాలయం వద్ద భక్తులకు అన్నదానం చేయడానికి షెడ్‌ నిర్మాణం.

రాచప్ప సమితి ఆధ్వర్యంలో ఏటా పర్యాటక ఉత్సవాల నిర్వహణ.

రూ.100 కోట్లు కేటాయించాలి

ప్రభుత్వం దృష్టి సారిస్తే రాచకొండ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చు. టెంపుల్‌ సిటీగా, ఫిలిం సిటీగా తీర్చిదిద్దవచ్చు. ఎంతో ఘన చరిత్ర ఉన్న రాచకొండ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించాలి. మౌలిక వసతులు కల్పించడంతో పాటు చారిత్రక కట్టాడాలను పరిరక్షించాలి. కోటను అభివృద్ధి చేయాలి. నిధుల కోసం ఇప్పటికే రాచప్ప సమితి కేంద్రానికి విన్నవించింది.

– సూరపల్లి వెంకటేశం,

రాచప్ప సమితి ప్రధాన కార్యదర్శి

రాచకొండ కోట ప్రవేశ ద్వారం
1/1

రాచకొండ కోట ప్రవేశ ద్వారం

Advertisement
Advertisement