
చట్టాలపై చెంచులకు అవగాహన
లింగాల: సమస్యల పరిష్కారం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుందని సంస్థ అధికారి నస్రీం సుల్తానా అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు శుక్రవారం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న అప్పాపూర్, మల్లాపూర్ పెంటలో లీగల్ అవేర్నెస్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంస్థ అధికారి పలు చట్టాల గురించి చుంచులకు అవగాహన కల్పించారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను తీసుకోవాలని ఆమె చెంచులకు సూచించారు. న్యాయపరమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ క్రమంలో పలువురు చెంచులు తమ సమస్యలను అధికారులతో మొరపెట్టుకున్నారు. అప్పాపూర్ పెంట సమీపంలో నూతనంగా మంజూరైన చెక్‌డ్యాంను త్వరగా పూర్తి చేయించి తాగునీటి సమస్య నివారించాలని చెంచులు కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను వెంటనే పూర్తిచేయించాలని, ఆధార్, రేషన్ కార్డులు, పింఛన్ల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు పాండునాయక్, శైలేంద్రకుమార్, సీఐ రవీందర్, ఎస్‌ఐ వెంకటేశ్వర్‌గౌడ్, ఆర్‌ఐ అనిల్, జూనియర్ అసిస్టెంట్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.