సూపర్ హీరోలు వస్తున్నారోచ్ | Upcoming Indian Superhero Movies updates | Sakshi
Sakshi News home page

సూపర్ హీరోలు వస్తున్నారోచ్

Jun 8 2025 3:59 AM | Updated on Jun 8 2025 7:15 AM

Upcoming Indian Superhero Movies updates

ఐరన్‌ మ్యాన్, బ్యాట్‌ మ్యాన్, హల్క్‌... ఇలా హాలీవుడ్‌  సూపర్‌ హీరో కథలను భారతీయ ప్రేక్షకులు వీక్షించారు. అబ్బురపరచే వారి సాహసాలను శభాష్‌ అన్నారు. అయితే ఇప్పుడు మన ఇండియన్‌ సినిమా సూపర్‌ హీరోస్‌ కూడా వస్తున్నారోచ్‌. వెండితెరపై ఆడియన్స్‌ను ఆశ్చర్యపరచే అద్భుత విన్యాసాలు, సాహసాలతో ఆడియన్స్‌ వావ్‌ అనేలా కష్టపడటానికి రెడీ అవుతున్నారు. ఇక మన సూపర్‌ హీరో వివరాలపై ఓ లుక్‌ వేయండి.

విశ్వంభర ప్రపంచంలో... 
‘విశ్వంభర’ సినిమాలో సూపర్‌ హీరో మాదిరి యాక్షన్‌ చేయనున్నాడట దొరబాబు. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్‌ అడ్వెంచరస్‌ అండ్‌ యాక్షన్‌ మూవీ ‘విశ్వంభర’. కాగా ఈ చిత్రంలో ఆంజనేయస్వామి భక్తుడు దొరబాబుపాత్రలో చిరంజీవి కనిపిస్తారని, దొరబాబుగా విశ్వంభర ప్రపంచంలో సాగే కొన్ని సన్నివేశాల్లో సూపర్‌ హీరోలా యాక్షన్‌ సన్నివేశాలు చేస్తారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. పంచభూతాల (గాలి, నీరు, భూమి, ఆకాశం, నిప్పు) నేపథ్యం, విశ్వంభర అనే బుక్, సిస్టర్స్‌ సెంటిమెంట్‌తో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం.

యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. కాక΄ోతే వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కారణంగా సినిమా విడుదల ఆలస్యమౌతోందని తెలుస్తోంది. ఈ వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీపై ఓ క్లారిటీ రానుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇతర ప్రధానపాత్రల్లో ఆషికా రంగనాథ్, బాలీవుడ్‌ యాక్టర్‌ కునాల్‌ కపూర్‌ కనిపిస్తారు. కీలకపాత్రల్లో సురభి, ఇషా చావ్లా, ప్రవీణ్‌ కనిపిస్తారని తెలిసింది.

వచ్చే ఏడాది స్టార్ట్‌ 
‘ఖైదీ, విక్రమ్, లియో’ వంటి మాస్‌ సినిమాలు తీసిన తమిళ దర్శకుడు లోకేశ్‌  కనగరాజ్‌ ఓ సూపర్‌ హీరో కథను రెడీ చేశారు. లోకేశ్‌ కనగరాజ్‌ కథలోని సూపర్‌ హీరోగా బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ కనిపించనున్నారు. ఈ సూపర్‌ హీరో సినిమాను ఇటీవల ఆమిర్‌ ఖాన్‌ ఓ సందర్భంలో కన్ఫార్మ్‌ చేశారు. దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ తనకు ఓ సూపర్‌ హీరో కథ చెప్పారని, లోకేశ్‌తో తాను ఈ సూపర్‌ హీరో మూవీ చేయనున్నానని, వచ్చే ఏడాది షూటింగ్‌ ప్రారంభిస్తామని ఆమిర్‌ ఖాన్‌ చెప్పారు.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుందనే  టాక్‌ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తాను హీరోగా నటించిన ‘సితారే జమీన్‌ పర్‌’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు ఆమిర్‌ ఖాన్‌. ఈ సినిమా తర్వాత దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌లో ఆమిర్‌ ఖాన్‌ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈలోపు కార్తీతో ‘ఖైదీ 2’ సినిమా చేసేస్తారు లోకేశ్‌ కనగరాజ్‌. ఇలా... ఆమిర్‌–లోకేశ్‌ల ఇతర కమిట్‌మెంట్స్‌ పూర్తయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లోని సినిమా సెట్స్‌కు వెళ్తుందని ఊహించవచ్చు. అలాగే లోకేశ్‌ దర్శకత్వంలోని తాజా చిత్రం ‘కూలీ’లో ఆమిర్‌ ఖాన్‌ ఓ గెస్ట్‌ రోల్‌ చేసిన సంగతి తెలిసిందే. రజనీకాంత్‌ హీరోగా, నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర ఇతర కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.

ఆన్‌ ద వే! 
సిల్వర్‌ స్క్రీన్‌పై రవితేజను ఓ సూపర్‌ హీరోగా చూపించనున్నారు ‘మ్యాడ్‌’ డైరెక్టర్‌ కల్యాణ్‌ శంకర్‌. ‘మ్యాడ్, మ్యాడ్‌ 2’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న ఈ దర్శకుడు కొన్ని రోజుల క్రితమే ఓ సూపర్‌ హీరో స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్నారు. ఈ కథను రవితేజకు వినిపించగా, ఈ హీరో ప్రాథమికంగా అంగీకారం తెలిపారట. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారట కల్యాణ్‌ శంకర్‌. ఈ స్క్రిప్ట్, ప్రీ ప్రోడక్షన్‌ వర్క్స్‌ ఓ కొలిక్కి వచ్చి, రవితేజకు కల్యాణ్‌ శంకర్‌ ఫైనల్‌ నరేషన్‌ ఇచ్చి, రవితేజ ఈ సినిమాకు ఓకే చెబితే, మూవీ సెట్స్‌పైకి వెళ్లినట్లే. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి మాత్రం కాస్త సమయం పట్టవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నూతన దర్శకుడు భాను భోగవరపుతో  ‘మాస్‌ జాతర’ అనే మూవీ చేస్తున్నారు రవితేజ.

ఆగస్టు 27న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. అలాగే కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘అనార్కలి’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే మూవీ కూడా చేస్తున్నారు రవితేజ. ‘మాస్‌ జాతర’ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ‘అనార్కలి’ సినిమా షూటింగ్‌ మొదలు కావాల్సి ఉంది. పైగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేస్తామని ఆల్రెడీ రవితేజ ప్రకటించారు. సో... ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాతే కల్యాణ్‌ శంకర్‌తో సూపర్‌ హీరో తరహా సినిమా చేసే ఆలోచన చేయవచ్చు రవితేజ. ఇక ఈ కళ్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘మ్యాడ్, మ్యాడ్‌ 2’ చిత్రాలు, రవితేజ ‘మాస్‌ జాతర’ సినిమాలను నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థనే కల్యాణ్‌ శంకర్‌–రవితేజల సూపర్‌ హీరో సినిమాను నిర్మించనుందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సో... సూపర్‌ హీరో ఆన్‌ ద వే అన్నమాట.

సరికొత్త ప్రపంచంలోకి... 
ఆడియన్స్‌ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారు హీరో అల్లు అర్జున్‌. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నారట దర్శకుడు అట్లీ. ఈ సినిమాలో ఊహకందని లొకేషన్స్, వినూత్నమైన జీవరాసులు ఉంటాయట. పైగా ఈ చిత్రంలో అల్లు అర్జన్‌ త్రిపాత్రాభినయం చేయనున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది. అయితే ఈ మూడుపాత్రల్లో ఒకపాత్ర సూపర్‌ హీరో తరహాలో ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఆల్రెడీ ఈపాత్రకు సంబంధించి విదేశీ సాంకేతిక నిపుణులు, ఫైటర్స్‌ నేతృత్వంలో అల్లు అర్జున్‌ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారని తెలిసింది.

ఇక ఈ చిత్రంలో కథ రీత్యా ఐదుగురు హీరోయిన్స్‌ ఉంటారనే టాక్‌ వినిపిస్తోంది. ఓ హీరోయిన్‌గా దీపికా పదుకోన్‌ నటించనున్నారు. దీపికపాత్రకు యాక్షన్‌ సీక్వెన్స్‌లు కూడా ఉన్నాయి. ఈ చిత్రంలో ఓ వారియర్‌ తరహాపాత్రలో కనిపిస్తారామె. ఇంకా ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మృణాల్‌ ఠాగూర్‌ భాగమయ్యారని, ఈ విషయంపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. భారీ బడ్జెట్‌తో సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. వీలైనంత తొందరగా ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి, 2027 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలన్నది చిత్రయూనిట్‌ ΄్లాన్‌ అని భోగట్టా.

ఇటు అధీర... అటు మహాకాళి! 
ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా కొన్ని సూపర్‌ హీరో తరహా సినిమాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హను–మాన్‌’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో తేజ సజ్జా సూపర్‌ హీరో పవర్స్‌ ఉన్న యువకుడు హనుమంతుపాత్రలో కనిపించి, ఆడియన్స్‌ను మెప్పించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ చిత్రం రూపొందుతోన్న  సంగతి తెలిసిందే. ‘కాంతార’ ఫేమ్‌ రిషబ్‌ శెట్టి మెయిన్‌ లీడ్‌ రోల్‌ చేస్తారు. అయితే ఈ చిత్రంలోనూ హనుమంతుపాత్ర ఉంటుందట. ఇంకా ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగానే ‘అధీర’ అనే సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చింది.

ఈ సూపర్‌ హీరో సినిమాలో నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కల్యాణ్‌ దాసరి హీరోగా నటిస్తారు. ఇంకా ప్రశాంత్‌ వర్మ యూనివర్స్‌లో భాగంగానే ‘మహాకాళి’ అనే మూవీ రానుంది. విశేషం ఏంటంటే... ఇది ఫీమేల్‌ సూపర్‌ హీరో మూవీ అన్నమాట. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో ఆర్‌కేడీ స్టూడియోస్‌ పతాకంపై ఆర్‌కే దుగ్గల్‌ సమర్పణలో రివాజ్‌ రమేశ్‌ దుగ్గల్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో ఎవరు మెయిన్‌ లీడ్‌ చేస్తారన్నది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కాగా ప్రశాంత్‌ వర్మ షో రన్నర్‌గా ఉన్న ‘మహాకాళి’ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ ఖన్నా ఓ కీలకపాత్రలో నటిస్తారు. గత ఏడాది దసరా పండగ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు ప్రశాంత్‌వర్మ. ఈపోస్టర్‌పై మోస్ట్‌ ఫెరోషియస్‌ సూపర్‌ హీరో ఇన్‌ ది యూనివర్స్‌ అని ఉండటం విశేషం.

పీపుల్స్‌ సూపర్‌ హీరో 
పీపుల్స్‌ సూపర్‌ హీరోగా చెప్పుకునే శక్తిమాన్‌ సరికొత్త పవర్స్‌తో వెండితెరపైకి రానున్నాడు. మూడు సంవత్సరాల క్రితమే ఈ ‘శక్తి మాన్‌’ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో శక్తి మాన్‌గా రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తారని, మలయాళ దర్శకుడు బాసిల్‌ జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తారని, హీరోయిన్‌గా వామికా గబ్బి కనిపిస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ‘శక్తి మాన్‌’ సినిమాలోని నటీనటులపై ఇంకా పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సిని మాలో రణ్‌వీర్‌ సింగ్‌ నటించడం లేదని, ఈ సినిమాకు ఓ నిర్మాతగానే ఆయన ఉంటారనే ప్రచారం కూడా బాలీవుడ్‌లో వినిపించింది. మరి... శక్తి మాన్‌గా ఎవరు కనిపిస్తారనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయక తప్పదు.

సూపర్‌ యోధ 
‘హను–మాన్‌’ ఫేమ్‌ తేజ సజ్జా హీరోగా రూపొందుతున్న అడ్వెంచరస్‌ యాక్షన్‌ డ్రామా మూవీ ‘మిరాయ్‌’. రితికా నాయక్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్‌ విలన్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో తేజ సజ్జా సూపర్‌ హీరో తరహాలో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన, ఈ ‘మిరాయ్‌’ గ్లింప్స్‌ వీడియోతో ఈ విషయం స్పష్టమౌతోంది. అడ్వెంచరస్‌తోపాటు కొన్ని మైథలాజికల్‌ అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు ఈ చిత్రదర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ముంబైలోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ ‘మిరాయ్‌’ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.

మల్టీవర్స్‌ మన్మథన్‌ 
మలయాళ నటుడు నివిన్‌ పౌలీ ఓ సూపర్‌ హీరో ఫిల్మ్‌ చేస్తున్నారు. ‘మల్టీవర్స్‌ మన్మథన్‌’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఆదిత్యన్‌ చంద్ర శేఖర్‌ దర్శకత్వం వహించనున్నారు. ఆనంద్, నితీరాజ్‌ ఈ సినిమాకు కో రైటర్స్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా ప్రక టించారు. ‘‘ఇండియాస్‌ ఫస్ట్‌ మల్టీవర్స్‌ సూపర్‌ హీరో సినిమా ఇది’’ అని ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ సమయంలో నివిన్‌ పౌలీ ‘ఎక్స్‌’పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ సూపర్‌ హీరో ఫిల్మ్‌ మూడు నాలుగు భాగాలుగా రానుందని, తొలి భాగంగా ‘మన్మథన్‌ రైజింగ్‌’ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం మలయాళ, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

కల నిజమైంది 
నటుడిగా ఉన్ని ముకుందన్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘భాగమతి, కిలాడి, యశోద’ వంటి సినిమాల్లో ఉన్ని ముకుందన్‌ నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ మలయాళ నటుడు ఓ సూపర్‌ హీరో సినిమాతో దర్శకుడిగా మారనున్నారు. ఆ మధ్య ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఉన్ని ముకుందన్‌. తాను చిన్నప్పట్నుంచి సూపర్‌ హీరో కథలు, వీరోచితపోరాటాలు చూస్తూ పెరిగానని, తన కలలో కొందరు సూపర్‌ హీరోస్‌ ఉన్నారని, వారిని వెండి తెరపైకి తీసుకువచ్చేందుకు తొలిసారి దర్శకత్వం వహించనున్నానని ఉన్ని ముకుందన్‌ పేర్కొన్నారు. మిథున్‌ మాన్యువేల్‌ థామస్‌ కథ అందిస్తున్న ఈ సినిమాను గోకులమ్‌ గోపాలన్‌ నిర్మించనున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు ఉన్ని ముకుందన్‌. ఈ కోవలో మరికొంతమంది సూపర్‌ హీరోలు వెండితెరపైకి రానున్నారు. – ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement