
ఆనంద్ మూవీతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది కమలినీ ముఖర్జీ. స్టైల్, గోదావరి, గమ్యం, గోపి గోపిక గోదావరి.. ఇలా పలు సినిమాల్లో కథానాయికగా నటించింది. చివరగా తెలుగులో గోవిందుడు అందరివాడేలే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత రెండు పరభాషా చిత్రాలు చేసిన ఆమె 2016 నుంచి ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది.
విభిన్న పాత్రల్లో..
తాజాగా తను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగులో నేను అన్ని రకాల ఎమోషన్స్ ఉండే అమ్మాయిగా నటించాను. చాలా సినిమాల్లో నేను అమ్మానాన్న లేని అనాథగానే కనిపించాను. బలమైన స్త్రీ పాత్రలు చేశాను. అదే సమయంలో చాలా సున్నితమైన అమ్మాయిగానూ కనిపించాను. కానీ, రానురాను అలాంటి బలమైన క్యారెక్టర్లు నాకు టాలీవుడ్‌లో రాలేదు.

అందుకే వెనకడుగు వేశా..
గోవిందుడు అందరివాడేలే సినిమాలో నాకు సరైన ప్రాముఖ్యత లేదనిపించింది. మూవీ పూర్తయ్యాక నేను పోషించిన పాత్ర చూసుకుని నాకే ఇబ్బందిగా అనిపించింది. బాధపడ్డాను కూడా! దానికోసం నేను గొడవపడాలని, రచ్చ చేయాలని అనుకోలేదు. అందుకే.. గోవిందుడు అందరివాడేలే తర్వాత తెలుగు సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుని టాలీవుడ్‌కు దూరంగా ఉన్నాను. అలా అని నాకు ఎవరిపైనా కోపం లేదు.
టాలీవుడ్ నుంచి తప్పుకున్నా..
సినిమాలో చాలా జరుగుతుంటాయి. దర్శకుడు ఓ సీన్ చేయమంటారు. తీరా అది అవసరం లేదనో, బాగోలేదనో దాన్ని ఎడిటింగ్‌లో తీసేస్తుంటారు. ఆ విషయాన్ని మాకు చెప్పరు. ఒక మాటైనా చెప్పకుండా మన సీన్, డైలాగులు తీసేస్తే బాధనిపిస్తుంది. దాన్ని నేను లైట్ తీసుకోలేను. బాధగా అనిపించడంతో తెలుగు సినిమా నుంచి తప్పుకుని ఇతర భాషల్లో చేశాను.
పెళ్లి
మలయాళ మూవీ పులి మురుగన్(2016) తర్వాత నాకు పెళ్లయింది. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను. చిన్నప్పుడు చదువుకే కేటాయించాను. పెద్దయ్యాక సినిమాలు చేశాను. ఇప్పుడు భార్యగా కుటుంబాన్ని చూసుకోవాలనుకున్నాను అని కమలినీ ముఖర్జీ చెప్పుకొచ్చింది.