
రోడ్డు ప్రమాదం.. పశువుల యజమానిపై కేసు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రోడ్డు ప్రమాదానికి కారణమైన పశువుల యజమానిపై హాజీపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నర్సింగాపూర్‌కు చెందిన ఏనుగు జయపాల్‌రెడ్డి శనివారం ఉదయం కారులో మంచిర్యాల నుంచి నర్సింగాపూర్‌కు వెళ్తున్నాడు. వేంపల్లిలో జాతీయ రహదారిపై ఒక్కసారిగా మూడు బర్రెలు అడ్డువచ్చాయి. దీంతో కారు బర్రెలను ఢీకొట్టి ధ్వంసం కాగా.. జయపాల్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. మూడు బర్రెలు మృతిచెందాయి. పశువులను ఇంటి వద్ద, కొట్టంలో ఉంచాల్సి ఉండగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాతమంచిర్యాల జ్యోతినగర్‌కు చెందిన పశువుల యజమాని కార్ల మల్లేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లేశ్‌ను అదుపులోకి తీసుకుని నోటీసులు జారీ చేశామని ఎస్సై తెలిపారు. పశువులను యజమానులు ఇళ్లు, కొట్టాల్లో కాకుండా రహదారులపైకి వదిలి ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
12న చెట్ల తొలగింపునకు వేలం
మంచిర్యాలటౌన్: పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాస గార్డెన్) వరకు (హైదరాబాద్–కరీంనగర్–చాందా రోడ్డు 251/9 నుంచి 255/7 కిలోమీటర్లు) విస్తరణలో భాగంగా ఇరువైపులా 63 చెట్ల తొలగింపునకు ఈనెల 12న వేలం పాట నిర్వహిస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు వేలం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ వేలంలో పాల్గొనాలని కోరారు.
ఆర్‌ఎంపీ క్లినిక్‌లపై చర్యలు తీసుకోవాలి●
● సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్
రామకృష్ణాపూర్: అనుమతులు లేకుండా ఇష్టానురీతిన వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్‌ఎంపీ, పీఎంపీ క్లినిక్‌లపై అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా సమితి సభ్యుడు వనం సత్యం డిమాండ్ చేశారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడారు. జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొంతమంది ఆర్‌ఎంపీలు ఇష్టారీతిన వైద్యం చేస్తున్నారన్నారు. ఆర్‌కేపీలో ఓ ఆర్‌ఎంపీ నిర్లక్ష్యం కారణంగానే శ్రీనాథ్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు ఇంజక్షన్ వికటించి మృతిచెందాడని అన్నారు. ఆ వైద్యుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితుడి పక్షాన కాకుండా స్థానిక కొంతమంది నాయకులు ఆర్‌ఎంపీ పక్షాన నిలుస్తూ సెటిల్‌మెంట్లకు యత్నించడం బాధాకరమన్నారు. యువకుడి ప్రాణాన్ని రూ.2 లక్షలకు విలువ కట్టడం ఏమిటని మండిపడ్డారు. సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్, ఇప్పకాయల లింగయ్య, నక్క వెంకటస్వామి, సాంబయ్య, పౌల్ తదితరులు పాల్గొన్నారు.