
చోరీ సామగ్రిని తిరిగి వదిలిన ఆగంతకులు
బెల్లంపల్లి: మండలంలోని గురిజాల రైతువేదిక నుంచి అపహరించుకు వెళ్లిన సామగ్రిని ఆగంతకులు తిరిగి అక్కడే వదిలివెళ్లారు. గురువారం రాత్రి రైతు వేదిక తాళం పగులగొట్టి అందులో సామగ్రిని పట్టుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వ్యవసాయ అధికారులు తాళ్లగురిజాల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సామగ్రిని ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు 24 గంటల వ్యవధిలో శుక్రవారం రాత్రి ఆ రైతువేదిక వద్ద తీసుకువచ్చి వదిలివెళ్లారు. బెల్లంపల్లి ఏడీఏ రాజా నరేందర్, బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దిన్, తాళ్లగురిజాల ఎస్సై సీహెచ్.రమేశ్, ఏవో ప్రేమ్‌కుమార్ శనివారం ఉదయం అక్కడికి చేరుకుని చోరీకి గురైన సామగ్రిని పరిశీలించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ చేస్తామని వ్యవసాయ, పోలీసు అధికారులు తెలిపారు.