
నేడు తొలి ఏకాదశి
● చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభం ● కిటకిటలాడనున్న ఆలయాలు
చెన్నూర్: తొలి ఏకాదశి పండగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు ప్రతినెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి మొత్తం రెండు ఏకాదశులు వస్తాయి. ఆదివారం తొలి ఏకాదశి పండగ నుంచే చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతాయి. ఆషాఢ శుక్లపక్షం నుంచి కార్తీక శుక్లపక్షం వరకు చాతుర్మాస్య దీక్షలు చేయడం అనవాయితీగా వస్తుంది. తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగా నిద్రకు ఉపక్రమిస్తారు. దీన్ని శయన ఏకాదశి అని పిలుస్తారు. నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి మేల్కొంటారు. ఈ నాలుగు నెలల కాలాన్ని ప్రజలు పవిత్ర నెలలుగా భావించి చాతుర్మాస్య దీక్షలు చేస్తారు.
పండగ విశిష్టత..
భక్తులు సూర్యోదయానికి ముందే గోదావరినదిలో స్నానాలు అచరించి మహావిష్ణువు ఆలయాలను సందర్శించి పూజలు చేస్తారు. చాతుర్మాసం ప్రారంభం కానుండడంతో శ్రీ మహావిష్ణువు ఆలయాలు కిటకిటలాడుతాయి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి తర్వాత రోజు మహావిష్టువును పూజించి నైవేద్యం సమర్పించి భోజనం చేస్తారు.
వ్రతాలు ఆచరించాలి
తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతాలు ఆచరించాలి. శ్రీమహావిష్ణువు యోగా నిద్రకు ఉపక్రమించే రోజు కావడంతో తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేసి మహావిష్టువు పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. – వేమారం మహేశ్వర్‌శర్మ,
అర్చకుడు, శివాలయం

నేడు తొలి ఏకాదశి