
అర్జీలు పెండింగ్..!
● వేలాదిగా వచ్చిన దరఖాస్తులు ● వందల్లోనే సమస్యలు పరిష్కారం ● కొనసాగుతున్న పరిశీలన ప్రక్రియ ● సాదాబైనామాలకు కలగని మోక్షం ● ఇదీ ‘భూ భారతి’ దరఖాస్తుల తీరు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తు ల పరిశీలన కోసం సంబంధిత అధికారులు సతమతమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారానికి వేలల్లో వినతులు వచ్చాయి. కాగా, వందల సంఖ్యలోనే పరిష్కారానికి అవకాశం కలు గుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తె లిసిందే. జిల్లాలో తొలుత పైలట్ మండలంగా భీ మారాన్ని ఎంపిక చేయగా, తర్వాత జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సదస్సుల ద్వారా 16వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటివరకు 200పైచిలుకు మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. ఇంకా వేలాది అర్జీలు పెండింగ్‌లోనే ఉన్నాయి.
సాదాబైనామాలు..
సాదాబైనామాలు, పీవోటీ, ప్రభుత్వ భూములకు సంబంధించి 5వేలకు పైగా అర్జీలు వచ్చాయి. తెల్ల కాగితాలపై జరిగిన భూ క్రయవిక్రయాలపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జిల్లాలో వేలాదిమంది ఈ సమస్య పరిష్కారం కోసం వేచి చూస్తున్నారు. మిగతావి సర్వే నంబర్ మిస్సింగ్, 2 వేలకు పైగా డిజిటల్ సైన్ పెండింగ్‌పై వచ్చాయి. మిగతా దరఖాస్తులో కోర్టు కేసులు, భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, భూమి రకంలో మార్పు, విరాసత్, కుటుంబ సభ్యుల పేర్లలో తప్పులు తదితర సమస్యలపై వచ్చినవి ఉన్నాయి. వీటన్నింటినీ అధికా రులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ప్రస్తుతం అర్జీల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు మొదట నోటీసులు ఇస్తూ దరఖాస్తుదారుల వద్ద ఉన్న రికార్డులు, ఆధారాలను పరిశీలిస్తున్నారు.
హద్దు సమస్యలు అలాగే..
అటవీ, రెవెన్యూ హద్దుల సమస్యలపై జిల్లా వ్యా ప్తంగా అనేక దరఖాస్తులు వచ్చాయి. ఈ సమస్యల పరిష్కారానికి అటవీ, రెవెన్యూ, సర్వే శాఖల అధి కారులు క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సి ఉంది. ఇందుకోసం ఇరు శాఖల మధ్య రికార్డుల ఆధారంగా ఆ భూములు ఏ రకానికి చెందినవో తేల్చాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యలు పరిష్కారం దిశగా వెళ్లడం లేదు. కొన్నిచోట్ల జాయింట్ సర్వేలు జరుగుతున్నప్పటికీ అటవీ, రెవెన్యూ శాఖలలో వేటివో స్పష్టంగా తేల్చలేకపోతున్నారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ భూములున్న చోట కూడా రికార్డుల్లో స్పష్ట త లేక అధికారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది.
పైలట్ మండలంలోనూ..
పైలట్ మండలం భీమారంలోనూ భూ సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ మండలంలో 2,140 దరఖాస్తులు రాగా, వీటిలో వెయ్యికిపైగా అర్జీలు సాదా బైనామాలవే ఉన్నాయి. మొత్తంగా 200 అర్జీలు పరి ష్కార యోగ్యంగా ఉన్నాయి. వీటిలో 108 అర్జీలు ఆర్డీవో స్థాయిలో సమస్య పరిష్కారానికి నివేదించారు. మిగతావి పరిశీలన దశలో ఉన్నాయి.

అర్జీలు పెండింగ్..!