
ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్
కోటపల్లి: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల డిప్యూటీ తహసీల్దార్ నవీన్‌కుమార్ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. భీమారం గ్రామానికి చెందిన గంట నరేశ్ నుంచి డబ్బులు డిమాండ్ చేసి పట్టుబడ్డారు. వివరాలిలా ఉన్నాయి. భీమారానికి చెందిన గంట నరేశ్ మండలంలోని రాజారం శివారులో సర్వే నంబరు 71/13/2లో 20గుంటల భూమిని తన తండ్రి లక్ష్మయ్య పేరిట పట్టా చేయించేందుకు ఈ కేవైసీ కోసం డిప్యూటీ తహసీల్దార్ నవీన్‌కుమార్‌ను సంప్రదించాడు. ఆయన రూ.15వేలు డిమాండ్ చేయగా.. అంత ఇచ్చే స్థోమత లేదని, రూ.10వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి నవీన్‌కుమార్‌కు సమాచారం ఇవ్వగా.. తాత్కాలిక ఉద్యోగి అంజికి ఇవ్వాలని సూచించారు. కార్యాలయం వెనుకాల డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదు సీజ్ చేసి కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి పలు ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. అంజి, డిప్యూటీ తహసీల్దార్ నవీన్‌కుమార్‌ను ఏసీబీ డీఎస్పీ మధు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. కేసు నమోదు చేసి కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టుకు తరలిస్తామని పేర్కొన్నారు. 20గుంటల భూమి పట్టా చేసేందుకు డిప్యూటీ తహసీల్దార్ పది రోజులుగా వేధిస్తున్నారని, ప్రతీరోజు ఉదయం సాయంత్రం వరకు ఇక్కడే ఉండడం డ్యూటీగా మారిందని నరేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు.