
భార్యను హత్య చేసిన భర్త అరెస్టు
తాండూర్: ఈనెల 3న కన్నెపల్లి మండలం మెట్‌పల్లిలో భార్యను హత్య చేసిన భర్తను అరెస్టు చేసినట్లు సీఐ కుమారస్వామి తెలిపారు. తాండూర్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. మెట్‌పల్లికి చెందిన ముడిమడుగుల తిరుపతికి దహెగాం మండలం భావన్‌నగర్ గ్రా మానికి చెందిన తులసీతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి గ్రీష్మ (4) పాప ఉంది. పెళ్లయిన నాటి నుంచి భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల కాలంలో తిరుపతి తన భార్య తులసీపై మరింత అనుమానం పెంచుకున్నా డు. ఈనెల 2న ఈ విషయమై భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఎలాగైనా కట్టుకున్న భార్యను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 3న ఇంట్లో తులసీ నిద్రిస్తుంది. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన తిరుపతి ఆమె మెడపై గొడ్డలితో నరికి చంపాడు. భార్యను చంపానని బంధువులకు ఫోన్లలో తెలిపాడు. తులసీ తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో కన్నెపల్లి ఎస్సై గంగారాం, సిబ్బంది పాల్గొన్నారు.