
నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి
చెన్నూర్/భీమారం: వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఉత్తమ్ జాడే అన్నారు. గురువారం ఆయన చెన్నూర్ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. చెట్ల కొమ్మలు, లూజ్‌లైన్లను సరి చేయాలని సూచించారు. విద్యుత్ కనెక్షన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. భీమారం మండలం నర్సింగాపూర్‌లో నిర్మించనున్న 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ స్థలాన్ని పరిశీలించారు. భీమారం నుంచి నర్సింగాపూర్ వరకు అటవీప్రాంతం గుండా విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా అందుకు అటవీశాఖ అభ్యంతరం తెలిపింది. భీమారం–నెన్నెల రహదారి గుండా వెళ్లే ఈ లైను రోడ్డుకి ఎంత దూరం నుంచి ఏర్పాటు చేయాల్సి ఉంటుందనేది పరిశీలించారు. అటవీశాఖ అనుమతి పొందేందుకు కలెక్టర్‌ను కలిసి వివరించన్నుట్లు తెలిపారు. కలెక్టర్ నుంచి అనుమతి రాగానే విద్యుత్ లైను వేసే పనులు చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డీఈ రాజన్న, ఏడీఈ బాలకృష్ణ, ఏఈలు ఏ.శ్రీనివాస్, శంకర్, ఏఏవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
నేడు దొడ్డి కొమురయ్య వర్ధంతి
మంచిర్యాలటౌన్: ఈ నెల 4న కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం 9:30 గంటలకు దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎ.పురుషోత్తం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.