
దసలి పట్టుతో వస్త్రం
● దారం, వస్త్ర తయారీలో శిక్షణకు 30మంది రైతుల ఎంపిక
● కాయ దిగుబడిలో తెలంగాణలో అగ్రస్థానం
● యంత్రాల కోసం రూ.20.54 లక్షలు
● మూడు నెలల్లో తయారీ షురూ..
చెన్నూర్: దసలి పట్టుకాయ దిగుబడిలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంటున్న మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టు పరిశ్రమ మరో అడుగు ముందుకేసింది. రైతులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పట్టు దారం, వస్త్ర తయారీకి సన్నద్ధం అవుతోంది. వస్త్ర తయారీకి అవసరమైన యంత్రాల కోసం రూ.20.54లక్షలు మంజూరయ్యాయి. దారం, వస్త్రాల తయారీపై శిక్షణకు 30మంది రైతులను ఎంపిక చేశారు. నెల రోజులపాటు నిపుణులతో చెన్నూర్ పట్టు పరిశ్రమలో శిక్షణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో మూడు నెలల్లో చెన్నూర్ కేంద్రంగా పట్టు వస్త్రాల ఉత్పత్తి ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.
చెన్నూర్ నంబర్ వన్
మంచిర్యాల జిల్లా చెన్నూర్ దసలి పట్టు సాగు రా ష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దసలి పట్టు కా య దిగుబడికి పేరుగాంచింది. ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి మించి దసలి పట్టు కా య దిగుబడి వచ్చింది. గతంతో పోలిస్తే ప్రభుత్వం పట్టు పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఇప్పటివరకు పట్టు కాయ దిగుబడి మాత్రమే ఉండగా..రానున్న రోజుల్లో రీలింగ్‌తోపాటు వస్త్రోత్పత్తికి అవకాశం ఉంది. ఇప్పటికే రైతులు సాగుతో ఉపాధి పొందుతుండగా.. వస్త్రోత్పత్తి జరిగితే మరింత ఉపాధి లభించే అవకాశం ఉంది.
భూమి లేని గిరిజన రైతులే..
అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే గిరిజన, ఎస్సీ, బీసీ నిరుపేద రైతులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దసలి పట్టు కాయ సాగును ప్రోత్సహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబా ద్ జిల్లాల్లో భూమి లేని రైతులను గుర్తించి దసలి కా య పండించే విధానంపై శిక్షణ ఇచ్చింది. మూడు దశాబ్దాలుగా జిల్లాలో సుమారు వెయ్యి మంది రైతులు 7,500 ఎకరాల్లో దసలి పట్టు కాయలు పండిస్తున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గొల్లతరివిడి, కౌటాల, బెజ్జూర్, మంచిర్యాల జిల్లా నెన్నెల మ ండలం మన్నెగూడెం, కోటపల్లి మండలం కొత్తపల్లి, రాజారాం, లింగన్నపేట, నాగంపేట, ఎదుల్ల బ ంధం, వేమనపల్లి మండలం ముల్కల్లపేట, చెన్నూ ర్ మండలం కిష్టంపేట, లింగంపల్లి గ్రామాల్లో దసలికాయను పండిస్తూ ఉపాధి పొందుతున్నారు. గత ఏడేళ్లుగా కుమురంభీం జిల్లాలో దసలి పట్టు సాగు కు అటవీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడ సాగు లేదు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోనే దసలి పట్టు కాయ సాగు చేస్తున్నారు.
ఏడాదికి మూడు పంటలు
దసలి పట్టు కాయ పంట 45రోజుల్లో చేతికొస్తుంది. వానాకాలం మూడు నెలలు వదిలితే ఏడాదికి మూడు పంటలు పండిస్తారు. కాయలో బైవొల్టిన్, ట్రైవొల్టిన్ అనే రెండు రకాలు ఉన్నాయి. మొదటి రకం వెయ్యి కాయకు రూ.4వేల నుంచి రూ.4,350 వరకు, రెండో రకం రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పలుకుతుంది. దసలి గుడ్లపై 50శాతం రాయితీ ఉండడంతో బైవొల్టిన్ దసలి కాయలనే ఎక్కువగా పండిస్తున్నారు.
మొదటి స్థానంలో మంచిర్యాల జిల్లా..
దసలి పట్టు కాయ దిగుబడిలో రాష్ట్రంలోనే మంచి ర్యాల జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రంలోని భ ద్రాచలం, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలో ద సలి పట్టు కాయ సాగు చేస్తుండగా.. మంచిర్యాల జి ల్లాలోనే అత్యధికంగా రైతులు పండిస్తున్నారు. ఇక్క డి పట్టు కాయకు తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ డిమాండ్ పలుకుతుంది. చెన్నూర్ పట్టు పరిశ్రమ ఆవరణలో దసలి పట్టు కాయ వేలం పాటల్లో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు పాల్గొనడం గమనార్హం.
చెన్నూర్ పట్టు పరిశ్రమ ఆధ్వర్యంలో 2024–25 ప్రగతి
ఉత్పత్తి లక్ష్యం సాధన
గుడ్ల ఉత్పత్తి 0 84,605
పెంచిన పట్టుగుడ్ల సంఖ్య 48,200 1,34,765
పండించిన దసలి కాయలు 24,10,000 32,29,301
ఈ ఏడాది రైతుల సంఖ్య 534 567
మూడు నెలల్లో..
గత ఏడాది దసలి పట్టు రైతుల కిసాన్ మేళాలో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.40 లక్షలు మంజూరు చేసింది. భవన నిర్మాణం పూర్తి కావడంతో ఇటీవల మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. భవనంలో దారం తీసే యంత్రాలను అమర్చి రీలింగ్ చేసి వస్త్రం ఉత్పత్తి చేస్తాం. త్వరలో రైతులకు శిక్షణ తరగతులు ప్రారంభించి మూడు నెలల్లో వస్త్రం తయారీ చేస్తాం.
– పార్వతీ రాథోడ్,
ఏడీ, సెరికల్చర్
రైతుల శ్రమే పెట్టుబడి..
దసలి పట్టు కాయ పంట సాగుకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. రైతుల శ్రమనే పెట్టుబడి. ఒక్కో రైతు రూ.2వేల నుంచిరూ.3వేలతో దసలి గుడ్లు కొనుగోలు చేస్తే సరిపోతుంది. గుడ్లు పిల్లలు అయ్యే వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి. పిల్లలు బయటకు వచ్చిన తర్వాత వాటిని చెట్లపై వేస్తారు. పట్టు పురుగులు ఆకులను తింటూ 20రోజులకు దసలి పట్టు కాయగా మారుతాయి. 40 నుంచి 55 రోజుల్లో కాయ చేతికి వస్తుంది. పట్టు పురుగులను పక్షులు తినకుండా కాయ దశకు వచ్చే వరకు జాగ్రత్తలు పాటిస్తే ఆశించిన లాభాలు వస్తాయి. రెండు నెలలు కష్టపడితే ఒక్కో రైతుకు 20వేల నుంచి 40వేల వరకు కాయ చేతికి వస్తుంది. ఒక్కొక్కరూ రూ.80వేల నుంచి రూ.1.50లక్షల వరకు సంపాదిస్తారు.

దసలి పట్టుతో వస్త్రం