
పౌరాణిక కథలు వినేవాళ్లం
మంచిర్యాల అర్బన్: వేసవి సెలవులకు మా ఊరు పెద్దంపేట్‌కు వెళ్లేవాళ్లం. అక్కడ మా తాతయ్య అనేక పౌరాణిక కథలు చెబుతుంటే మిత్రులతో కలిసి వినేవాళ్లం. హజీపూర్ మండలం కేంద్రంలో నాలుగో తరగతి వరకు చదువుకున్నాను. ఐదో తరగతి నుంచి ఏడో తరగతి వరకు అక్కవాళ్ల ఊరు వెల్గటూర్ మండలం చెగ్యమాలకు వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో సెలవులు రాగానే అందరం పెద్దంపేట్‌కు వచ్చేవాళ్లం. మాది వ్యవసాయ కుటుంబం కావటంతో అడవికి వెళ్లి కట్టెలు తీసుకువచ్చేవాళ్లం. నానమ్మ–తాతయ్యతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్తూ సరదాగా గడిపేవాళ్లం. రోడ్డు వెంట అల్లనేరేడు చెట్లుండేవి. మిత్రులతో కలిసి పండ్లు రాల్చిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. మోటబావి పక్కనున్న జామ చెట్టు పైనుంచి పండ్లు కిందపడగానే తిన్నరోజులు ఎప్పటికీ మరిచిపోలేను. బాల్యంలో స్నేహితులతో కలిసి గడిపిన మధురానుభూతులన్నీ ఇప్పటికీ గుర్తుకొస్తున్నాయి.
– అంజయ్య, డీఐఈవో, మంచిర్యాల