
ఇదేం ఎయిడెడ్ పాఠశాల
దేవరకద్ర: పట్టణంలోని భారతీయ విద్యానికేతన్ (బీవీఎన్) ఎయిడెడ్ పాఠశాలను సందర్శించిన ఎంపీడీఓ, ఎంఈఓ అక్కడి పరిస్థితులను చూసి నివ్వెరపోయారు. పాఠశాలలో కేవలం 5 మంది విద్యార్థులకు గాను నలుగురు ఉపాధ్యాయులు ఉన్నట్లు గుర్తించి ముక్కున వేలేసుకున్నారు. వివరాలిలా.. గతంలో ప్రైవేట్‌గా ఉన్న భారతీయ విద్యానికేతన్ పాఠశాలను ఎయిడెడ్‌గా మార్చిన తర్వాత ప్రతి ఏడాది కొద్దిమేర విద్యార్థులు తగ్గిపోతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ బలరాం సందర్శించారు. పాఠశాలలో 5 మంది ఉపాధ్యాయులు ఉండగా నలుగురు ఉపాధ్యాయులు ఉన్నట్లు రిజిష్టర్‌లో పేర్కొన్నారు. అందులోనూ నలుగురు విద్యార్థులే హాజరు కాగా.. ఒక ఉపాధ్యాయులు సెలవులో ఉండగా.. ముగ్గురు ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఒకప్పటి ప్రభుత్వ పాఠశాల భవనం కేటాయించగా గదలన్నీ శిథిలావస్థకు చేరగా కేవలం ఒక గది మా త్రమే వినియోగంలో ఉందని హెచ్‌ఎం ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఉన్న గదిలోనే చదువులు సాగించ డానికి ఇబ్బందులు ఎదురుకావడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుదలకు కారణమైందని పేర్కొన్నారు.
గతంలో ఇద్దరు డిప్యూటేషన్..
గతేడాది కేవలం 15 మంది విద్యార్థులు ఉండటంతో నలుగురు ఉపాధ్యాయులలో ఇద్దరిని ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్‌పై పంపించామని ఎంఈఓ బలరాం తెలిపారు. ఈ ఏడాది కేవలం 5 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని.. ఒక ఉపాధ్యాయుడిని పాఠశాలకు కేటాయించి మిగతా ముగ్గురిని డిప్యూటేషన్‌పై పంపిస్తామని పేర్కొన్నారు. ఈ పాఠశాల గురించి జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఎంపీడీఓ చెప్పారు.
ఐదుగురు విద్యార్థులకునలుగురు ఉపాధ్యాయులు
నివ్వెరపోయిన మండల అధికారులు

ఇదేం ఎయిడెడ్ పాఠశాల