
వీరన్నపేట సమీపంలో మళ్లీ కనబడిన చిరుత
మహబూబ్‌నగర్ న్యూటౌన్: మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని వీరన్నపేట పరిధిలో హెచ్‌ఎన్ ఫంక్షన్ హాలు సమీపంలోని గుట్ట మీద రాళ్లపై చిరుత సంచరిస్తున్న ఫొ టోలు, వీడియోలు బుధవారం సోషల్ మీడియాలో వైరలయ్యాయి. స్పందించిన ఏడుగురు ఫారెస్టు సెక్షన్ అధికారులు, బీట్ ఆఫీసర్ల బృందం చిరుత సంచరిస్తున్న ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. ఫారెస్టు అధికారులతో పాటు పోలీసులు అక్కడికి చేరుకొని ప్రజలను అప్రమత్తం చేశారు. స్థానికులు స్వయంగా చిరుతను చూసినట్లు తెలపడంతో గుట్టపై బోనుతోపాటు సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఫారెస్టు రేంజ్ అధికారి సయ్య ద్ కమాలుద్దీన్ తెలిపారు. అడవిలో చిరుతల సంతతి పెరిగినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
గాధిర్యాల్ అటవీప్రాంతంలో చిరుత కలకలం
మహమ్మదాబాద్: మండలంలోని గాధిర్యాల్ అటవీ ప్రాంతంలోని ఓగుట్టపై చిరుత ఉండడం కలకలం రేపింది. బుధవారం సాయంత్రం పొలాల నుంచి వస్తున్న రైతులు గుట్టపై ఓ గుండు మీద ఉన్న చిరుతను చూశారు. వెంటనే అక్కడ దారిగుండా వెళ్తున్న పలువురు రైతులు కలిసి కొంత దగ్గరికి వెళ్లి చూడగా.. గుండుపై చిరుత ఉండడాన్ని గమనించారు. వెంటనే పలువురు రైతులు కెమెరాలో చిరుత ఫొటోలు తీశారు. అక్కడే చాలామంది గుమిగూడి దాన్ని పరిశీలిస్తుండగా.. అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు రైతులు తెలిపారు. చిరుత సంచారంతో గ్రామస్తులు, దగ్గరలోని రైతులు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు చిరుత సంచారాన్ని గమనించి రైతులు భయభ్రాంతులు చెందకుండా అవగాహన కల్పించాలని తెలిపారు.
భయాందోళనతో అధికారులకు సమాచారం
ఫారెస్టు అధికారులు, పోలీసుల పరిశీలన

వీరన్నపేట సమీపంలో మళ్లీ కనబడిన చిరుత