
వివాదాస్పద భూమి ఎన్‌ఓసీ అందించండి
జడ్చర్ల: పట్టణంలోని వంద పడకల ఆస్పత్రి దగ్గర తమ కుటుంబ సభ్యులు ఎన్‌ఓసీ ఉన్న భూమిని కొనుగోలు చేశారని చెబుతున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వారం రోజుల్లో సంబంధిత ఎన్‌ఓసీ ప్రతిని స్థానిక తహసీల్దార్‌కు అందించాలని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఇటీవల తాను చేసిన ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే స్పందించారు. తనకు రాచరిక పాలన అంటే ఏమిటో తెలియదన్నారు. ఆస్పత్రి వద్ద మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అక్క పేరున భూమి ఉండటంతోనే తాను మాట్లాడానని, పేరు లేకపోతే మాట్లాడేవాడిని కాదన్నారు. ఈ భూమికి సంబంధించిన ఎన్‌ఓసీ రెవెన్యూ కార్యాలయంలో లేదని, దీని డాటా ఇవ్వాలని ఇప్పటికే అధికారులు నోటీసులు జారీచేశారన్నారు. తన మేనల్లుడి పేరిట 1,200 చ.గ స్థలం ఉందని స్వయంగా మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చెప్పారని ఆ స్థలాన్ని ఎప్పుడు ప్రభుత్వానికి వెనక్కి ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే మాట్లాడినట్లు తన తల్లి ఎక్కడా భూ లావాదేవీలు జరపలేదన్నారు. ఆమె మాజీ సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో హస్తవాసి బాగుంటుందని కొందరు అభిమానంతో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోయించుకుంటున్నారని చెప్పారు. తాము బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులతో సైతం కలిసి ముగ్గులు పోయడం, ప్రొసీడింగ్స్ ఇవ్వడం చేస్తున్నామన్నారు. మీ హయాంలో తమ పార్టీల వారిని ఎక్కడా దగ్గరకు రానివ్వలేదని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే తమపై చేసిన ఆరోపణలకు త్వరలోనే విలేకరుల సమావేశంలో అన్ని వివరాలు చెబుతానని చెప్పారు.
జడ్చర్లను నంబర్ 1 చేస్తా..
జడ్చర్ల నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిపరిచి నంబర్ 1 చేస్తానని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలిపారు. బాలానగర్ మండలంలోని మోతీఘనపూర్‌లో రూ.50 లక్షలు, గోప్లాపూర్‌లో రూ.25 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అండర్ డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కొత్తగా వేసిన తాగునీటి బోర్లను ప్రారంభించారు. గత బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించారని, ఎక్కడా పేదలకు ఇళ్లు, రేషన్‌కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.