●
కష్టాలు తీరుతాయి..
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు మా ఊరి పొలాలకు ఆనుకొని ఉన్నా చుక్క నీరు అందని పరిస్థితి. దీంతో ఇక్కడి భూములు బీడుగా మారాయి. గత పాలకులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. అజిలాపూర్ లిఫ్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం సంతోషంగా ఉంది. లిఫ్ట్ పనులు పూర్తయితే మాకు సాగునీటి కష్టాలు తీరుతాయి.
– రాజుగౌడ్, రైతు, అజిలాపూర్
వ్యవసాయం చేసుకుంటా..
నాకు ఆరెకరాల భూమి ఉన్నప్పటికీ సాగునీరు లేక వ్యవసాయం చేయడం లేదు. సాగునీటి కోసం కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతున్నా. రైతుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ఇక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పనులు త్వరగా పూర్తిచేసి సాగునీరు అందిస్తే సంతోషంగా వ్యవసాయం చేసుకుంటా.
– తిరుమలయ్య, రైతు, అజిలాపూర్
ఇచ్చిన మాట కోసం..
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పక్కనే ఉన్నప్పటికీ సాగునీరు అందక 6 గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు దిగువ వైపు పొలాలు ఉన్న రైతులు సాగు చేసుకుంటే.. ఎగువ వైపు ఉన్న రైతులకు సాగునీరు అందక వలసలు పోతున్నారు. రైతులందరికీ సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అజిలాపూర్ లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నాం. పనులు వేగంగా పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిస్తాం.
– మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర
దేవరకద్ర రూరల్: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ వేలాది ఎకరాలకు చుక్కనీరు అందడం లేదు. ఎత్తయిన ప్రదేశంలో పొలాలు ఉండటమే ఇందుకు కారణం. దీంతో వందలాది ఎకరాలు బీడు భూములుగా మారాయి. తమ భూములుకు సాగునీటిని అందించాలని రైతులు గత ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. అయితే ఎట్టకేలకు ఈ ప్రాంత రైతుల ఆకాంక్షకు మోక్షం లభించింది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కృషితో అజిలాపూర్‌లో లిఫ్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పథకం నిర్మాణం కోసం రూ.32 కోట్లు మంజూరు చేస్తూ ఇటీవల జీఓ జారీ చేసింది. త్వరలోనే పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు.
రెండు దశల్లో పనులు..
ఎత్తిపోతల పథకం పనులను రెండు దశల్లో చేపట్టేందుకు సంబంధిత అధికారులు ప్రణాళిక రూపొందించారు. ముందుగా స్టేజ్–1లో భాగంగా కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి కొంత దూరంలో ఉన్న జీలుగ గుట్ట వద్ద 0.05 టీఎంసీ సామర్థ్యంతో పంప్‌హౌజ్ నిర్మించనున్నారు. పంప్‌హౌజ్ నుంచి పైప్‌లైన్ ద్వారా వచ్చే నీటిని నింపేందుకు అజిలాపూర్ సమీపంలోని పూరికుంట వద్ద మినీ రిజర్వాయర్ ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ఓపెన్ కాల్వలు, పిల్ల కాల్వల ద్వారా సమీప రైతుల పొలాలకు సాగునీరు అందించనున్నారు.
రూ.32 కోట్లతో ఎత్తిపోతల పథకం మంజూరు
5 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం
రెండు దశల్లో పనులు.. త్వరలోనే టెండర్లు
స్టేజ్–2లో భాగంగా కోయిల్‌సాగర్ నుంచి గతంలో ఏర్పాటు చేసిన గ్రావిటీ కెనాల్ ద్వారా వచ్చే నీటి ఆధారంగా గద్దెగూడెం చెరువు నట్టలవానికుంట వద్ద 0.05 టీఎంసీ సామర్థ్యంతో రెండో పంప్‌హౌజ్ నిర్మించనున్నారు. కిలోమీటరు దూరంలో రెండో మినీ రిజర్వాయర్ ఏర్పాటుచేసి.. అక్కడి నుంచి పైప్‌లైన్ లేదా కాల్వల ద్వారా గద్దెగూడెం, వెంకటాయపల్లి గ్రామాల పరిధిలో ఉన్న 5 కుంటలను నీటితో నింపనున్నారు. అక్కడి నుంచి రైతుల పొలాలకు నేరుగా సాగునీరు అందించనున్నారు.
అజిలాపూర్ లిఫ్ట్‌కు గ్రీన్‌సిగ్నల్
అజిలాపూర్ లిఫ్ట్‌కు గ్రీన్‌సిగ్నల్
అజిలాపూర్ లిఫ్ట్‌కు గ్రీన్‌సిగ్నల్
అజిలాపూర్ లిఫ్ట్‌కు గ్రీన్‌సిగ్నల్