
నకిలీ వైద్య కేంద్రాలపై టీజీఎంసీ తనిఖీలు
ఎంజీఎం : నగరంలోని గోపాల్‌పూర్, యాదవనగర్ ప్రాంతాల్లో నకిలీ వైద్యులు నడుపుతున్న కేంద్రాలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) తనిఖీలు నిర్వహించినట్లు టీజీఎంసీ సభ్యుడు వి.నరేశ్‌కుమార్ ఆదివారం తెలిపారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా స్టెరాయిడ్లు, యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్ వంటి ఔషధాలను వాడుతున్న నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గోపాల్‌పూర్‌లోని సాదుల్లా మెడికల్ స్టోర్ పని చేస్తున్న ఎండీ అక్బల్ షరీఫ్ మెడికల్ షాప్ వెనుకభాగంలో పడకలతో ఆస్పత్రిలా నడుపుతూ ఐవీ ఫ్లూయిడ్స్, నొప్పి నివారణ ఇంజెక్షన్లు అనధికారంగా ఇస్తున్నారన్నారు. అలాగే, గోపాల్‌పూర్‌లోని అంజలి రెడ్డి క్లినిక్‌లో సి.హెచ్. వెంకట్ రెడ్డి ఎలాంటి విద్యార్హత లేకున్నా 20 సంవత్సరాల నుంచి క్లినిక్ నడుపుతున్నాడు. అలాగే, డిప్లొమా ఇన్ ఓటీ టెక్నీషియన్ చేసిన క్రాంతి కుమార్ యాదవనగర్‌లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్‌గా పేర్కొంటూ బెడ్లు ఏర్పాటు చేసి పేషెంట్లకు హైఎండ్ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు ఇస్తున్నారని తనిఖీల్లో బయటపడిందన్నారు. వర్షాకాలంలో వ్యాధులు నిర్లక్ష్యం చేయొద్దని, ఈ సమయంలో నకిలీ డాక్టర్లను/ రూరల్ మెడికల్ ప్రాక్ట్టీషనర్స్ (ఆర్‌ఎంపీ) సంప్రదించడం వల్ల అనారోగ్యం మరింత పెరగడంతో పాటు వీరి వద్ద ఇచ్చే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, అనవసర యాంటీబయాటిక్స్ వాడకంతో రోగుల ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి మీ పరిసరాల్లో ఆర్‌ఎంసీ/ నకిలీ వైద్యులు ఇంజెక్షన్లు వేస్తున్నా, మందులు రాస్తున్నా వెంటనే టీజీఎంసీ వాట్సాప్ నంబర్ 91543 82727కి సమాచారం ఇవ్వాలని నరేశ్ కోరారు. తనిఖీల్లో వరంగల్ యాంటీ క్వాకరీ కమిటీ చైర్మన్ అన్వర్ మియా, హెచ్‌ఆర్‌డీఏ వరంగల్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.వెంకటస్వామి, బృందం పాల్గొన్నారు.
పలు వైద్య కేంద్రాలపై కేసులు