
ఆర్టీసీ కండక్టర్‌తో ప్రయాణికుడి గొడవ
● చేతిలో ఉన్న ఎస్‌ఆర్, డబ్బులతో పరుగు
● పట్టుకుని పోలీసులకు అప్పగింత
జనగామ: ఆర్టీసీ బస్సులో కండక్టర్‌తో గొడవపడి టికెట్ వివరాలను నమోదు చేసే ఎస్‌ఆర్, డబ్బులను ఓ ప్రయాణికుడు ఎత్తుకెళ్లిన ఘటన ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలో జరిగింది. కండక్టర్ శంకర్ కథనం ప్రకారం.. జనగామ డిపోకు చెందిన టీఎస్27టీ7232 నంబర్ గల అద్దె బస్సు సిద్దిపేట నుంచి బయలుదేరింది. జిల్లా కేంద్రంలోని కోర్టు వద్ద ఓ ప్రయాణికుడు బస్సు ఎక్కాడు. టిమ్‌సర్వీస్ క్లోజ్ చేశానని కండక్టర్ తెలిపారు. అయితే సదరు ప్రయాణికుడు గొడవ చేయడంతో టిమ్‌ను రీ ఓపెన్ చేసి టికెట్ ఇచ్చాడు. అయినా సదరు ప్రయాణికుడు బూతు పురాణం మొదలు పెట్టాడు. తోటి ప్రయాణికులు సైతం అతడిని వా రించినా వినలేదు. కృష్ణ కళామందిర్ జంక్షన్‌లోని గాంధీ విగ్రహం వద్దకు రాగానే బస్సు స్లో కావడంతో కండక్టర్ చేతిలో ఉన్న ఎస్‌ఆర్, డబ్బులు లాక్కుని పరారయ్యాడు. దీంతో కండక్టర్, ప్రయాణికులు కేకలు పెట్టారు. అక్కడే ఉన్న స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించి, డిపో మేనేజర్‌కు సమాచారం అందించారు. ప్రయాణికుడి పూర్తి వివరాలు తెలియలేదు.