
మిషన్.. నిరుపయోగం!
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో పలు వాహనాలు నిరుపయోగంగా మారాయి. అధికారులు ఏమాత్రం ఆలోంచించకుండా సుమా రు రూ.55లక్షలతో రోడ్డు స్వీపింగ్ మిషన్, రూ.20 లక్షలతో కాల్వలు శుభ్రం చేసే మిషన్ కొనుగోలు చేశారు. స్వీపింగ్ మిషన్ మానుకోట రోడ్లపై పని చేయడం లేదు. కాల్వలు శుభ్రం చేసే మిషన్ పరిస్థితి కూడా అంతే. దాదాపు రెండున్నర సంవత్సరాలుగా మూలనపడి ఉంటున్నాయి. వాటితో పాటు నాలుగు ఆటోలు కూడా మూలనపడి తుప్పు పడుతున్నాయి. దీంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లక్ష జనాభా..
మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు ఉండగా.. 68,889 మంది జనాభా, 57,828 మంది ఓటర్లు, 25,000 పైచిలుకు గృహాలు ఉన్నాయి. విద్య, వ్యాపారం, ఉద్యోగ రీత్యా మానుకోటలో నివాసం ఉండే వారితో కలిపి జనాభా లక్ష దాటుతుంది. అవుట్ సోర్సింగ్‌లో 205 మంది పని చేస్తుండగా.. వారిలో 143 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ట్రాక్టర్లు 11, మూడు చక్రాల ఆటోలు 14, నాలుగు చక్రాల ఆటోలు 19 ఉండగా ప్రతీ రోజు 33 టన్నుల చెత్త సేకరణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సిగ్నల్ కాలనీ శివారులో ఒక చెత్త డంపింగ్ యార్డు, గాంధీపురం గ్రామశివారులో మరో డంపింగ్ యార్డు ఉన్నాయి. కాగా జనాభాకు తగిన విధంగా పారిశుద్ధ్య కార్మికులు లేరు. కాగా పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు.
రూ.55లక్షలతో రోడ్డు స్వీపింగ్ మిషన్..
సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం 14వ ఫైనాన్స్ నిధుల నుంచి రూ.55 లక్షల వ్యయంతో రోడ్డు స్వీపింగ్ మిషన్ కొనుగోలు చేశారు. అలాగే రూ.20 లక్షలతో కాల్వలు శుభ్రం చేసే జేసీబీ లాంటి మిషన్ కొనుగోలు చేశారు. కానీ మానుకోట రోడ్లపై స్వీపింగ్ మిషన్ పనిచేయడం లేదు. రోడ్డు మీద నడపగానే మిషన్ బుష్‌లు, ఇతర పరికరాలు ఊడిపోయాయి. దీంతో నాటి నుంచి నేటి వరకు మిషన్ మూలన పడింది. అలాగే కాల్వలు శుభ్రం చేసే మిషన్ కూడా మానుకోట కాల్వల్లో పని చేయడం లేదు. అలాగే రెండు సంవత్సరాల క్రితం ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులు మానుకోట మున్సిపాలిటీకి నాలుగు మూడు చక్రాల ఆటోలు బహూకరించారు. ఆబ్యాంక్‌లో మానుకోట మున్సిపాలిటీ ఖాతా ఉండడం.. లావాదేవీలు జరపడం వల్ల ఆటోలు బహూకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ ఆటోలు కూడా పనిచేయడం లేదు.
సుమారు కోటి రూపాయలు వృథా..
రోడ్డు స్వీపింగ్ మిషన్, కాల్వల శుభ్రం చేసే మిషన్, నాలుగు ట్రాలీ ఆటోలను కలిపితే సుమారు కోటి రూపాయలు వృథా అయ్యాయి. మానుకోట మున్సిపాలిటీ పరంగా రూ.70 లక్షలు, బ్యాంక్ ద్వారా ఆటోలకు రూ.25 లక్షలు, ఇతర వస్తువులు కొనుగుల కలిపి సుమారు కోటి రూపాయలు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. సుమారు రెండున్నర సంవత్సరాలుగా మూలకు పడడంతో.. ప్రస్తుతం వాటి టైర్లు, పరికరాలు పాడైపోతున్నాయి.
డ్రైవర్లు లేకనే..
ఇంజనీరింగ్ విభాగం అధికారులు మాత్రం శిక్షణ పొందిన డ్రైవర్లు లేకనే మిషన్లు మూలకుపడ్డాయని చెబుతున్నారు. అయితే కొనుగోలు చేసేటప్పుడు మానుకోట మున్సిపాలిటీ డ్రైవర్లకు అవగాహన ఉందో లేదో తెలుసుకోవాలి. కానీ ఎవరిని సంప్రదించకుండానే తొందరపడి కొనుగోలు చేసి అభాసుపాలయ్యారు. కాగా ఉపయోగపడే విధంగా మార్పులు చేసి వెంటనే వినియోగంలోకి తేవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
15 రోజుల్లో వినియోగంలోకి వస్తాయి..
మిషన్లకు రిపేర్లు ఉన్నాయి. వాటిని మరమ్మతులు చేసి 15రోజుల్లో వినియోగంలోకి తెస్తాం. డ్రైవర్లకు కూడా వాటిని నడిపే విషయంలో శిక్షణ ఇప్పించి ఉపయోగిస్తాం. అవి వినియోగంలోకి వస్తే పారిశుద్ధ్యపరంగా చాలా వరకు సమస్యలు తగ్గుతాయి.
–సీహెచ్.ఉపేందర్, మానుకోట మున్సిపల్ డీఈ
వృథాగా స్వీపింగ్ మిషన్, ఆటోలు
ప్రజాధనం దుర్వినియోగం
అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం

మిషన్.. నిరుపయోగం!

మిషన్.. నిరుపయోగం!