
సహకార భావనతోనే సమాజాభివృద్ధి
● టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు
హన్మకొండ : సహకార భావనతోనే సమాజాభివృద్ధి సాధ్యమనే నినాదంతో సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలపాలని రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ఆకాంక్షించారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ సహకార వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా డీసీసీబీ కార్యాలయ ఆవరణలో రవీందర్ రావు మొక్క నాటి, మాట్లాడుతూ.. ప్రతి ఏటా జూలై మొదటి శనివారాన్ని అంతర్జాతీయ సహకార దినోత్సవంగా జరుపుకుంటారని వివరించారు. సహకార సంస్థల పాత్ర, వాటి ప్రయోజనాలు, సామాజిక ప్రభావాన్ని విశ్వవ్యాప్తంగా తెలియజేయడమే సహకార దినం ఉద్దేశమన్నారు. 2012లో మొదటి అంతర్జాతీయ సహకార సంవత్సరం నిర్వహించినట్లు గుర్తు చేశారు. 13 సంవత్సరాల తర్వాత ఈ వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణలో మహిళా సహకార సంఘాలు, స్వయం సహాయక సమూహాలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. యువతకు సహకార రంగాల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా సహకార అధికారి సంజీవ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్లు ఎన్నమనేని జగన్‌మోహన్ రావు, నరేందర్, సీఈఓ వజీర్ సుల్తాన్, జీఎంలు ఉషా శ్రీ, పద్మావతి, డీజీఎం అశోక్, ఏజీఎంలు గొట్టం స్రవంతి, మధు, రాజు, గంప స్రవంతి, కృష్ణ మోహన్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.