మహబూబాబాద్ రూరల్ : విద్యుత్ సరఫరాలో తలెత్తిన సాంకేతికలోపాన్ని సరిచేసేందుకు వెళ్లిన విద్యుత్ కాంట్రాక్టు (ఆన్ మ్యాన్డ్) హెల్పర్ విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లి గ్రామ శివారులో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, విద్యుత్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన గట్ల కరుణాకర్ రెడ్డి (46) విద్యుత్‌శాఖలో కాంట్రాక్టు (ఆన్ మ్యాన్డ్) పద్ధతిపై హెల్పర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం స్థానిక రైతులు పలు ప్రాంతాల్లో విద్యుత్ సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పడంతో గ్రామ శివారులోగల ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి విద్యుత్ మోటారుకు సంబంధించిన స్టార్టర్ వద్ద మరమ్మతులు చేస్తున్నాడు. అంతలోనే ఒక్కసారిగా సర్వీస్ వైరు ఆయనకు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయేందర్ రెడ్డి, డీఈ విజయ్ కుమార్, ఏడీఈ ప్రశాంత్, రూరల్ ఇన్‌చార్జ్ ఏఈ వెంకటేశ్, మున్సిపాలిటీ ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ వెన్నం లక్ష్మారెడ్డి, ఇతర సిబ్బంది, ఉద్యోగులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య ప్రియాంక, కుమార్తె శ్రీవల్లి, కుమారుడు సుశాంత్ రెడ్డి ఉన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పోస్టుమార్టం గదిలో కరుణాకర్ రెడ్డి మృతదేహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ సందర్శించి, మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
చాలామంచి సేవకుడిని కోల్పోయాం...
కరుణాకర్ రెడ్డి దుర్మరణం విషయం తెలుసుకున్న వెంటనే ఈదులపూసపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, తండాలవాసులు సంఘటన స్థలానికి వచ్చి ఆయన మృతదేహాన్ని సందర్శించారు. కరుణాకర్ రెడ్డి ఎంతో మంచి సేవకుడని, ఏసమయంలోనైనాసరే కరెంటు సమస్య వచ్చిందని ఫోన్ చేసి చెప్పగానే ఆలస్యం చేయకుండా వచ్చి మరమ్మతులు చేసి వెళ్లిపోయే వాడని కన్నీరుమున్నీరుగా విలపించారు.
విద్యుత్ కార్మికుడికి తీవ్ర గాయాలు..
మొగుళ్లపల్లి: విద్యుత్ స్తంభంపై మరమ్మతు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ సరఫరా కావడంతో ఓ కార్మికుడు కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం మండలంలోని మొట్లపల్లిలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మొట్లపల్లి గ్రామ ఉపవిద్యుత్ కేంద్రంలో గ్రామానికి చెందిన జన్నె అనిల్ కొన్ని సంవత్సరాలుగా అన్‌మ్యాన్డ్ కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజుమాదిరిగానే విధి నిర్వహణలో భాగంగా ఎల్సీ తీసుకుని మరమ్మతు చేస్తున్నాడు. కాగా, అదే లైన్ మీద నుంచి కొద్ది దూరంలో 33కేవీ సామ్యర్థం గల మరో లైన్ వెళ్తోంది. ఈ క్రమంలో అనిల్ మరమ్మతు చేస్తున్న లైన్‌కు సంబంధించిన తీగ ప్రమాదవశాత్తు మరో లైన్‌కు చెందిన 33కేవీ తీగకు తాకింది. దీంతో విద్యుత్ సరఫరా జరగడంతో అనిల్ ప్రమాదానికి గురై స్తంభంపై నుంచి పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించి వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.
విద్యుదాఘాతంతో విద్యుత్ కాంట్రాక్టు హెల్పర్ దుర్మరణం
విద్యుదాఘాతంతో విద్యుత్ కాంట్రాక్టు హెల్పర్ దుర్మరణం