
మేడిగడ్డకు జలకళ..
కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ జలకళ సంతరించుకుంటోంది. జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం మీదుగా ప్రాణహిత నది గోదావరిలో కలుస్తుంది. అక్కడి నుంచి దిగువన మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవా హం తరలుతోంది. దీంతో బ్యారేజీ వద్ద 77,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, బ్యారేజీలో మొత్తం 85 గేట్లు ఎత్తి వేయడంతో అవుట్‌ఫ్లో అదే స్థాయిలో విడుదల చేస్తున్నారు. దీంతో కొన్ని రోజులుగా నీరు లేక వెలవెలబోయిన మేడిగడ్డ బ్యారేజీ వరద తాకిడితో జలకళ సంతరించుకుంది.
సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి
భారీగా వరద నీరు..
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామం వద్ద గోదావరిపై నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి భారీగా వరద నీరు చేరుతోంది. వారం రోజుల నుంచి ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు చేరడంతో నది నిండుగా ప్రవహిస్తోంది. బుధవారం వరకు 40వేల క్యూసెక్కులతో సాధారణంగా ప్రవహించిన గోదావరి.. గురువారం భారీగా వరద నీరు చేరడంతో 94,500 క్యూసెక్కులతో ప్రవహిస్తోది. దీంతో ఇంజనీరింగ్ అధికారులు బ్యారేజీ వద్ద 59 గేట్లలో 14 గేట్లు ఎత్తి 94,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ సామర్థ్యం 6.94టీఎంసీలకు గాను ప్రస్తుతం 3.92టీఎంసీల నీరు ఉంది. బ్యారేజీ నీటి మట్టం 83 మీటర్లకు గాను 79.65 మీటర్ల మట్టం కొనసాగుతోంది. కాగా, దేవాదుల వద్ద ఉన్న చొక్కారావు ఎత్తిపోతల నుంచి రెండు మోటార్ల ద్వారా 494 క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తున్నట్లు డీఈ శరత్ బాబు తెలిపారు.