
నదీతీరం..శోకసంద్రం
మేడిగడ్డ వద్ద గోదావరిలో ఆరుగురు విద్యార్థుల గల్లంతు
కాళేశ్వరం: ఒకటే ఊరు. వారంతా 20 ఏళ్లలోపు విద్యార్థులు. సమీప బంధువులు. అదే గ్రామానికి చెందిన బంధువుల వివాహ వేడుకల్లో విందులు, వినోదాలతో ఆనందంగా గడిపారు. సరదాగా గడుపుదామని కాళేశ్వరం గోదావరి నదికి వెళ్లారు. ఈతరాని వారు ఒడ్డున నీటిలో ఆడలాడుతున్నారు. నది నీటి మట్టం పెరిగిన విషయం తెలియక మోకాల్లోతు నీటిలో ఆడుకుంటుండగా ఒకరు ప్రమాదవశాత్తు లోతులోకి వెళ్లిపోతుండగా అతన్ని కాపాడబోయి మరొకరు.. ఇతన్ని కాపాడబోయి మరొకరు ఇలా ఆరుగురు గల్లంతయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లి గ్రామ సమీపంలోని మేడిగడ్డ ఎగువ భాగంలో మూడవ బ్లాక్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో విషాధం అలుముకుంది.
అర్ధరాత్రి వరకు సాగిన గాలింపు..
సాయంత్రం 6 గంటలకు ఆరుగురు విద్యార్థులు నదిలో మునగగా, సుమారు 8 గంటల సమయంలో స్థానికులు, పోలీసులకు సమాచారం అందింది. వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమైంది. భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఆరు రెస్క్యూ బృందాలతోపాటు మహారాష్ట్రలోని సిరొంచకు చెందిన ఆపద మిత్ర గజ ఈతగాళ్ల బృందాలతో గాలింపు చర్యలు చేపట్టింది. కాగా రాత్రివేళ కావడం, నదిలో 5,100 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండటంతో గాలింపు చేపట్టడం సాధ్యం కాలేదు. రాత్రి 11.50 గంటలకు గాలింపు చర్యలు ఆపివేశారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించనున్నారు. కాగా కాటారం డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి గోదావరిలోకి దిగి నది ప్రవాహాన్ని అంచనా వేశారు. ఆదివారం ఉదయం గాలింపు చర్యల కోసం రెస్క్యూ టీం ప్రత్యేక బోట్లను సిద్ధం చేసింది.
ఐదు కుటుంబాల్లో విషాదం...
పెళ్లి వేడుకలను సంతోషంగా గడిపిన ఐదు కుటుంబాల్లో ఒకే రోజులో విషాదం నెలకొంది. పట్టి వెంకటస్వామి ఇద్దరు కుమారులతో పాటు మరో నాలుగు కుటుంబాలకు చెందిన విద్యార్థులు చనిపోవడంతో ఆయా కుటుంబాలతో పాటు పెళ్లింట విషాదం నెలకొంది.
బిడ్డల కోసం ఎదురుచూస్తూ...
గల్లంతైన ఆరుగురు విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు రాత్రి నుంచి గోదావరి నది ఒడ్డునే ఉండి వేచి చూస్తున్నారు. అధికారులు గాలింపు చర్యలను నిలిపివేసి వెనుదిరిగినప్పటికీ గల్లంతైన వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉండి రోదించసాగారు. తమ పిల్లలు ప్రాణాలతో బయటకు రాకపోతారా... అని వేచి చూస్తుండటం స్థానికులను కలచివేసింది.
నేనూ సచ్చిపోయేవాడినే: పట్టి శివమణి
(ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్న వ్యక్తి)
స్నానం చేసేందుకు మొదట నలుగురు దిగారు. తరువాత మరో ఇద్దరు దిగారు. ఒకరి వెనుక ఒకరు నీట మునిగారు. క్షణాల్లోనే అందరూ మునగసాగారు. కన్నుమూసి తెరిచే లోపే ఆరుగురు మునిగిపోయారు. మధుసూదన్ మునిగిపోతుంటే చేయి పట్టుకొని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన నీట మునిగాడు. దీంతో నేనే భయపడి ఒడ్డుకు చేరుకున్నా.
అడ్డుకున్నప్పుడు ఆగి ఉంటే..
ఈతకు వెళ్లిన వారిలో అంబట్‌పల్లి గ్రామానికి చెందిన పట్టి వెంకటస్వామికి కుమారులు మధుసూదన్, శివమనోజ్ కూడా ఉన్నారు. వీరితో పాటు మిగిలిన ఐదుగురు గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్తుండగా నదిలో నీటి మట్టం ఎక్కువగా ఉందని, స్నానానికి వెళ్లొద్దని వెంకటస్వామి వారించాడు. అయినా వారు వినకుండా వెళ్తామనడంతో అతను కూడా వెంటవెళ్లాడు. వీరు లోపలికి వెళ్తుండగా వెళ్లొద్దని, వెనక్కి రండని పిలిచాడు. కానీ అప్పటికే లోతులోకి వెళ్లిపోయారు. కళ్లెదుటే మునిగిపోతున్నా వెంకటస్వామిది ఏమీ చేయలేని పరిస్థితి.
గల్లంతైన వారు..
అంబట్‌పల్లి వాసులు: పట్టి మధుసూదన్(18), పట్టి శివమనోజ్(15), తొగరి రక్షిత్(13), కర్ణాల సాగర్(16)
మహాముత్తారం మండలం కొర్లకుంట వాసులు: బొల్లెడ్ల రాంచరణ్(17), స్తంభంపల్లి(పీపీ)కి చెందిన పసుల రాహుల్(19)
వరంగల్ నగరంలో మరో విద్యార్థి
మృతుడు నెక్కొండ వాసి
హసన్‌పర్తి: స్నేహితులతో ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెడ్డిపురం చెరువు వద్ద శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం టేకులకుంట తండాకు చెందిన తేజావత్ గణేష్ నగరంలోని అతిథి హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే హాస్టల్‌లో ఉంటున్న మాలోతు కార్తీక్, రాకేష్, సాయి కిరణ్‌తో కలిసి గణేష్ శనివారం రెడ్డిపురం సమీపంలోని చెరువులోకి ఈతకు వెళ్లాడు. నలుగురు చెరువులోకి దిగి ఈతకొట్టడం ప్రారంభించారు. గణేష్ ఈత కొడుకు ముందుకు వెళ్లి మునిగిపోయాడు. గణేష్ మునిగినట్లు గ్రహించిన స్నేహితులు ఈ విషయాన్ని బంధువులు, మిత్రులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. చెరువులోనుంచి గణేష్ మృతదేహాన్ని వెలికి తీశారు. పంచనామా చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మృతుడి తండ్రి తేజావత్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.
సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11.50 వరకు సాగిన గాలింపు చర్యలు..
లభించని ఆచూకీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మహదేవపూర్ మండలం
అంబట్‌పల్లిలో విషాదం

నదీతీరం..శోకసంద్రం

నదీతీరం..శోకసంద్రం

నదీతీరం..శోకసంద్రం

నదీతీరం..శోకసంద్రం

నదీతీరం..శోకసంద్రం