ఉచితమని రూ.500 వసూలు చేస్తారా?
● ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి
● వేదావతి నదిని పరిశీలించిన ఎమ్మెల్యే
హొళగుంద: ‘ చంద్రబాబు, ఆయన సర్కార్ ఉచిత ఇసుక అని చెబుతుంటే టీడీపీ నాయకులు మాత్రం డబ్బులు వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్‌కు రూ.500 ఇవ్వాలని బెదిరిస్తున్నారు. దీనికి చంద్రబాబునాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి’ అని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మార్లమడికి వద్ద ఉన్న వేదావతి నదిని ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఉచిత ఇసుక విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను ట్రాక్టర్ డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. ఇసుక కోసం వెళ్తే టీడీపీ నాయకులు ట్రాక్టర్‌కు రూ.500ఇవ్వాలంటున్నారని, ఇవ్వకపోతే బెదిరిస్తున్నారని చెప్పగా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఇసుక, కల్తీ మద్యం దందా చెలరేగిపోతోందన్నారు. ప్రతి ఊరిలో బెల్ట్‌షాపులు వెలిశాయని ఆరోపించారు. ఉచిత ఇసుక అంటూ టీడీపీ నాయకులు డబ్బులు వసూళ్లు చేస్తుండటాన్ని జిల్లా కలెక్టర్, ఏఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. స్థానిక ఎస్‌ఐ ట్రాక్టర్ డ్రైవర్లను బెదిరించడం మంచి పద్ధతి కాదన్నారు. ఇసుక, లిక్కర్, రేషన్ బియ్యం విషయంలో రాజకీయం చేయకుండా శాంతి భద్రతలను కాపాడాలని, లేదంటే ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఉచిత ఇసుకకు ఎవరైనా రూ.500 ఇవ్వాలని బెదిరిస్తే ఊరుకునేది లేదన్నారు. ఎమ్మెల్యే వెంటే వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ షఫీవుల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గిరి, చంద్ర, సిద్దలింగ, మరిమల్ల, శేక్షావలి, సిద్దయ్య, కాకి ఫక్కీరప్ప, లక్ష్మన్న, వీరేష్, గర్జప్ప తదితరులు ఉన్నారు.


