ఉచిత లడ్డూ ప్రసాదం
స్పర్శ, అతిశీఘ్ర దర్శన భక్తులకు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచి భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. అతిశీఘ్ర దర్శనం టికెట్టుదారులకు (రూ.300) ఉచితంగా ఒక లడ్డూ, స్వామివారి స్పర్శదర్శనం టికెట్టుదారులకు ఉచితంగా రెండు లడ్డూ ప్రసాదాలు అందజేస్తారు. అలాగే పలు కార్యక్రమాలను ప్రారభించనున్నారు. సోమవా రం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులం అధునికీకరణ పనులకు భూమిపూజ, 10.40 గంటలకు గంగాధర మండపం వద్ద నూతనంగా నిర్మించబడిన విరాళాల సేకరణ కేంద్రం ప్రారంభించనున్నారు. అలాగే దేవస్థాన పరిపాలన భవనంలో ధర్మకర్తల మండలి అధ్యక్షుల ఛాంబర్ ప్రాంరభిస్తారు. అనంతరం అమ్మవారి ఆలయం వెనుకభాగంలో కై లాస కంకణాల విక్రయకేంద్రం ప్రారంభించనున్నారు.
శ్రీగిరికి పోటెత్తిన భక్తులు
శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.


