కొండలపై ‘పచ్చ’ గద్దలు!
● ఎర్రమట్టిని కొల్లగొడుతున్న
టీడీపీ నాయకులు
● అనుమతులు లేకున్నా అక్రమ రవాణా
● చోద్యం చూస్తున్న అధికారులు
ఆదోని రూరల్: టీడీపీ నాయకులు బరితెగించారు. అధికారంలో ఉన్నాం.. తమను ఎవరూ ఏమీ చేయలేరని ప్రకృతి సంపదను దోపిడీ చేస్తున్నారు. ఆదోని మండలంలోని ఇస్వీ గ్రామ వద్ద ఉన్న కొండల్లో ఎర్రమట్టిని అక్రమంగా తవ్వుతున్నారు. అనుమతులు లేకున్నా యథేచ్ఛగా తరలించి అమ్ముకుంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. టీడీపీకి చెందిన ఒక నాయకుడు ఎర్రమట్టి వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు. ఇటీవల ఇస్వీ గ్రామంలో సర్పంచ్ శ్యామలమ్మ నేతృత్వంలో మట్టి పనులు జరుగుతుండగా ఇదే నాయకుడు అడ్డుకున్నాడు. ఇప్పుడు కొండల్లో అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు జరుపుతున్నాడు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.600 నుంచి రూ.1000 వరకు వసూళ్లు చేస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ తవ్వకాలకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు. అయినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొండలు మాయం అయ్యే పరిస్థితికి రావడంతో గ్రామస్తులు ఇటీవల సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడకి వచ్చే సమయానికి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారు వెళ్లిపోయారు. ఇస్వీ సమీపంలోని బసవేశ్వర ఆలయం వద్ద కొండలు మాయం అవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
కొండలపై ‘పచ్చ’ గద్దలు!


