● విచారణ జరపాలని మైనింగ్ శాఖ డైరెక్టర్, నంద్యాల కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు
కర్నూలు(సెంట్రల్): డోన్ నియోజకవర్గంలోని చిన్నమల్కాపురం, పెద్దమల్కాపురం, జలదుర్గం, కొచ్చెర్వు, బావాయిపాలెం, చంద్రపల్లె గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. భూగర్భ ఖనిజాల కోసం 100 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిపి పర్యావరణ అసమతుల్యతకు కారణమవుతున్నారని మండి పడింది. ప్రభుత్వానికి లీజు, రాయల్టీ చెల్లించకుండా వ్యాపారం చేస్తున్నా మైనింగ్, పోలీసు, రెవెన్యూ శాఖలు ఏమి చేస్తున్నాయని ఆ సంస్థ చైర్మన్ జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి జూన్ 7వ తేదీలోపు రహస్యంగా నివేదిక ఇవ్వాలని నంద్యాల జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేశారు. డోన్ నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో కొందరు 8 చోట్ల మైనింగ్ కోసం లీజును పొందారు. అయితే అనుమతులు లేని చోట తవ్వకాలు జరుపుతున్నట్లు మీడియాలో వచ్చిన ఓ కథనాన్ని శనివారం లోకాయుక్త సుమోటోగా విచారణకు స్వీకరించింది. అక్రమైనింగ్ నివారణకు చర్యలు తీసుకోవాలని మైనింగ్ శాఖ డైరక్టర్‌తోపాటు నంద్యాల జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు ఇచ్చింది. శాఖల వారీగా విచారణ జరపాలని ఆదేశించింది. అక్రమ మైనింగ్‌కు సంబంధించి మైనింగ్ శాఖ డైరెక్టర్ నివేదిక ఇవ్వాలని, రెవెన్యూ, ఇతర అంశాలకు సంబంధించి కలెక్టర్, అక్రమ రవాణాపై ఎస్పీ నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. మైనింగ్ చెక్ పోస్టులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని సూచించింది.