అనధికార లేఅవుట్లను తొలగించండి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు, ఆక్రమణలను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్లను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మునిసిపల్ కమిషనర్లతో పలు అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వ హించారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో అనధికార ఆక్రమణలు, లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తూ మార్చి వరకు గడువు ఇచ్చిందన్నారు. నిర్ణీత గడువులోగా ఆక్రమణదారులు క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. దీని కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆక్రమణదారుల జాబితాను పరిశీలించి అందరికీ నోటీసులు జారీ చేయాలని, ఎవరైనా స్పందించకపోతే జేసీబీలతో తొలగించేందుకు సిద్ధం కావాలని ఆదేశించారు. మచిలీపట్నం నగరంలోని డంపింగ్‌యార్డులో పాత వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మచిలీపట్నంలోని నారాయణపురం, గుడివాడలోని దనియాలపేట, బేతవోలులో త్వరితగతిన పట్టణ ఆరోగ్య కేంద్రాలను నిర్మాణం పూర్తి చేయాలని పేర్కొన్నారు. తాడిగడపలో మంజూరైన కానూరు ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి వెంటనే స్థలం గుర్తించాలని ఆదేశించారు. చెత్త నుంచి కంపోస్ట్ తయారుచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పెడనలో మూడు సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, ఉయ్యూరులో రెండు ట్రీట్‌మెంట్ ప్లాంట్ల స్థలాలను గుర్తించాలన్నారు. సమావేశంలో మునిసిపల్ కమిషనర్లు బాపిరాజు, గోపాలరావు, మనోహర్, రామారావు తదితరులు పాల్గొన్నారు.


