పాఠశాలల్లో కలెక్టర్ తనిఖీలు
మచిలీపట్నంటౌన్: ఈ నెల ఐదో తేదీన జరిగే మెగా పేరెంట్, టీచర్స్ మీటింగ్‌కు సిద్ధం కావాలని విద్యాధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. మెగా పీటీఎం నిర్వహించనున్న నేపథ్యంలో నగరంలోని పలు పాఠశాలలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధానోపాధ్యాయు లతో ముఖాముఖి మాట్లాడి చేపట్టాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేశారు. తొలుత రాజుపేట నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. అక్కడ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఎఫ్‌ఎల్‌ఎన్ బేస్ లైన్ పరీక్షలను పరిశీలించారు. అనంతరం దేశాయిపేటలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసిన విజ్ఞానాన్ని కలిగించే వివిధ రకాల వైజ్ఞానిక, ఇతర పరికరాలను, క్రికెట్, ఫుట్బాల్ వంటి క్రీడా సామాగ్రిని పరిశీలించారు. విద్యార్థుల పురోగతిని తెలిపే హోలిస్టిక్ కార్డులు, బేస్ లైన్ పరీక్షల నివేదికలు విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేసి విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారో అవగాహన కలిగించాలన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట డెప్యూటీ ఈఓ శేఖర్‌సింగ్, ఎంఈఓలు దుర్గాప్రసాద్, గురు ప్రసాద్, శోభారాణి, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, సీఆర్పీ యూనస్ ఉన్నారు.


