
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
● ఎదురెదురుగా ఢీకొన్న ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ● ఐదుగురుకి తీవ్ర గాయాలు
జి.కొండూరు: ఆర్టీసీ బస్సు, డీసీఎం వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. బస్సులో 30 మంది వరకు ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఐదుగురు వ్యక్తులకు గాయాలై ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాలలోకి వెళ్తే.. తెలంగాణా రాష్ట్రం, వరంగల్ జిల్లా, హన్మకొండ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి గుంటూరుకు వస్తుంది. ఇదే క్రమంలో గుంటూరు జిల్లా గనపవరం నుంచి పీవీసీ కిటికీ డోర్ల లోడుతో డీసీఎం వాహనం తెలంగాణా రాష్ట్రంలోని కొత్తగూడెంకు బయలుదేరింది. జి.కొండూరు శివారులోకి రాగానే 30 నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు వాహనాల క్యాబిన్‌లు ఒకదానిలోకి మరొకటి చొప్పించుకుపోయి బస్సు డ్రైవర్ బట్టి నర్సింహరావు రెండు కాళ్లు ఇరుక్కుపోయాయి. ఈ క్రమంలో సమాచారం అందుకున్న జి.కొండూరు ఎస్‌ఐ సతీష్‌కుమార్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒక జేసీబీ, క్రేన్ సాయంతో అర్ధగంటపాటు శ్రమించి రెండు వాహనాలను విడదీశారు. బస్సు డ్రైవర్ నర్సింహరావుని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ నర్సింహరావుకు ఎడమకాలు విరిగిపోగా మరొక డ్రైవర్ జానపరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్లు ఇద్దరూ హన్మకొండకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా డీసీఎం వాహనం క్యాబిన్‌లో ఉన్న వల్లూరి సందీప్ కుడి చేతికి రెండు వేళ్లు తెగిపోయాయి. గర్నెపూడి రత్నకుమార్ తలకు స్వల్ప గాయమైంది. గర్నెపూడి ఉదయ్‌భాస్కర్ కుడి కాలు విరిగిపోగా, ఎడమ కాలు పాదం తెగిపోయింది. డ్రైవర్ గుంటుపల్లి నాగప్రసాద్‌కి ఎటువంటి గాయాలు కాలేదు. డీసీఎం వాహనంలో డ్రైవర్ మినహా ప్రయాణిస్తున్న ముగ్గురు క్షతగాత్రులు కూడా గుంటూరు శివారు బుడంపాలెంలో నివాసం ఉంటూ గనపవరం పీవీసీ కిటీకీల డోర్ల తయారీ కంపెనీలో పని చేస్తున్నట్లు తెలిసింది. క్షతగాత్రులు అందరినీ రెండు అంబులెన్స్‌లలో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఎవరికీ ప్రాణహాని లేదని పోలీసులు తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది వరకు ప్రయాణికులకు ఎటువంటి గాయాలు లేకపోవడంతో వారందరూ వేరే వాహనాల్లో గమ్య స్థానాలకు చేరుకున్నారు. ఎడమవైపు వెళ్లాల్సిన బస్సు కుడి వైపునకు వచ్చి డీసీఎం వాహనాన్ని ఢీకొట్టిన క్రమంలో బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ సతీష్‌కుమార్ తెలిపారు.