
హిందూ సమాజంపై ఉగ్రదాడులకు అవకాశం
వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): హిందూ సమాజంపై ఉగ్రదాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వబిలిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. విజయవాడ సత్యనారాయణపురంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిందన్నారు. దీనికి ఉదాహరణగా ఇతర రాష్ట్రాల్లో అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొని ఇక్కడకు వచ్చిన ఉగ్రవాదులు అబూబకర్ సిద్దిక్, మహ్మద్ ఆలీలలను అరెస్టు చేశారన్నారు. ఇటీవల రాయచోటిలో హిందువుల ఊరేగింపుపై దాడి చేయడం వంటి సంఘటనల వెనుక ఉగ్రమూకల కుట్ర ఉందన్నారు. ఇటీవల విజయనగరంలో కూడా కొందరు ఉగ్రవాదులను ఎన్‌ఐఏ గుర్తించిందన్నారు. ఉగ్రవాదులను ఏరిపారేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శులు భూపతిరాజు సుబ్బరాజు, పర్రే కోటేశ్వరరావు, విజయవాడ మహానగర్ కార్యదర్శి కే.రామకృష్ణ, సహ కార్యదర్శి కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.