
రసాయన వ్యర్థం.. రైతుకు అనర్థం
జి.కొండూరు: ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి పారిశ్రామికవాడలో ఉన్న పలు కంపెనీల నుంచి విడుదలవుతున్న రసాయన వ్యర్థాలను పక్కనే ఉన్న జి.కొండూరు మండలంలోని తొమ్మండ్రం వాగులో కలుస్తున్నాయి. ఈ వ్యర్థాల కారణంగా వాగుకు రెండువైపులా ఉన్న కట్టుబడిపాలెం గ్రామస్తులు వ్యాధుల బారిన పడుతున్నారు. వాగులో నీరు తాగి మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. రసాయన వ్యర్థాలు తిష్టవేయడంతో కవులూరుకు చెందిన వందల ఎకరాల సాగు భూమి చవుడుబారుతోంది. కట్టుబడిపాలెం, కవులూరు గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా ఈ సమస్యపై పోరాడుతున్నా ఫలితం కనిపించలేదు. అప్పుడప్పుడూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు హడావుడి చేయడం తప్ప రసాయన వ్యర్థాలను వాగులోకి విడుదల చేయకుండా అడ్డుకోలేకపోతున్నారని రెండు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. రెండు గ్రామాల ప్రజలు ఇటీవల వాగు వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. తమ సమస్యను పరిష్కరించకపోతే ఖరీఫ్ సాగు కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిత్యం వేల లీటర్ల వ్యర్థాలు..
కొండపల్లి ఐడీఏలో నాలుగు వందల వరకు పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఫార్మా, కెమికల్ కంపెనీలు 12, ప్లాస్టిక్ కంపెనీలు మూడు, మడ్డి ఆయిల్ కంపెనీలు నాలుగు, టైర్ ఆయిల్ కంపెనీలు మూడు వరకు ఉన్నాయి. ఈ పరిశ్రమల నుంచి రోజుకు వేల లీటర్లు రసాయన వ్యర్థాలు విడుదలవుతాయి. ఈ వ్యర్థాలను శుద్ధి చేసేందుకు రసాయన పరిశ్రమల సొసైటీ ఆధ్వర్యంలో కొండపల్లి సమీపంలోనే రూ.8 కోట్లతో రీసైక్లింగ్ యూనిట్‌ను నిర్మించారు. అయితే ఈ వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా రీసైక్లింగ్ యూనిట్‌కు తరలించాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఆయా కంపెనీల నిర్వాహకులు తమ ప్రాంగణాల్లోనే నిల్వ ఉంచి వర్షంపడినప్పుడు, రాత్రి వేళ, సెలవు రోజుల్లో పరిశ్రమలకు పక్కనే ఉన్న తొమ్మండ్రం వాగులోకి వదిలేస్తున్నారు.
కొండపల్లి ఐడీఏ కంపెనీల వ్యర్థాలు తొమ్మండ్రం వాగులోకి విడుదల రసాయన వ్యర్థాలతో చవుడుబారుతున్న సాగు భూములు వ్యాధుల బారిన పడుతున్న కట్టుబడిపాలెం గ్రామస్తులు వాగులో నీరు తాగి మృత్యువాత పడుతున్న మూగజీవాలు
చర్యలు తీసుకోకుంటే ఎడారే
తొమ్మండ్రం వాగులోకి రసాయన వ్యర్థాలను వదలడం వల్ల భూములు చవుడుబారుతున్నాయి. పంటలు పండక రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యపై ఎంత పోరాటం చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే వ్యవసాయ భూమి ఏడారిలా మారుతుంది.
– చెరుకూరి శ్రీనివాసరావు,
రైతు సంఘం నాయకుడు, కవులూరు గ్రామం

రసాయన వ్యర్థం.. రైతుకు అనర్థం