
పెడన: కృష్ణా జిల్లాలో ఖాళీగా ఉన్న వలంటీర్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటి ఫికేషన్ జారీ చేశారు. జిల్లాకు 4,292 పోస్టులు మంజూరవగా ప్రస్తుతం 4,083 మంది విధులు నిర్వహిస్తున్నారు. వివిధ కారణాలతో 209 పోస్టుల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నెల 31 నుంచి ఏప్రిల్ ఆరో తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా అర్హులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్ కమిషనర్లు ఈ దరఖాస్తులను పరిశీలించి, అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అభ్యర్థులు దరఖస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. గతంలో ఉన్న రిజర్వేషన్లే ఇప్పుడు కూడా వర్తిస్తాయని పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ సేవలపై శిక్షణ మాన్యువల్ ఆవిష్కరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని ఆరోగ్య మిత్రలు, సచివాలయ ఏఎన్‌ఎంలకు ఆరోగ్య శ్రీ పథకం కింద అందిస్తున్న సేవల వివరాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు డాక్టర్ వైస్సార్ ఆరోగ్యశ్రీ శిక్షణ మాన్యువల్ బుక్‌లెట్స్‌ను కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు గురువారం ఆవిష్కరించారు. డాక్టర్ వైస్సార్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ఈ శిక్షణ మాన్యువల్ బుక్‌లెట్స్‌ను రూపొందించింది. జిల్లాలో 607 మంది సచివాలయ ఏఎన్‌ఎంలు, 147 మంది నెట్వర్క్ హాస్పిటల్ ఆరోగ్య మిత్రలకు టీం లీడర్ల ద్వారా శిక్షణ ఇస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఏఎన్‌ఎం, ఆరోగ్య మిత్రల విధులు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందిస్తున్న వైద్య సేవల వివరాలు సమగ్రంగా ఇందులో పొందుపర్చినట్లు కలెక్టర్ వివరించారు. ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జె.సుమన్, టీం లీడర్ పి.శివరాం ప్రసాద్, చలపాక శ్యాంబాబు, ఆఫీస్ అసోసియేట్ రవి కుమార్ పాల్గొన్నారు.
దుర్గమ్మకు
పుష్పార్చన వైభవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు గురువారం కనకాంబరాలు, ఎర్రగులాబీలతో విశేష పుష్పార్చన వైభవంగా జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి విగ్రహం వద్ద ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు పుష్పార్చన నిర్వహించారు. ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, ఈఓ భ్రమరాంబ, ఉభయదాతలు, పలువురు భక్తులు ఈ పూజలో పాల్గొన్నారు. నవరాత్రుల్లో చివరి రోజు కావడంతో అమ్మవారికి నిర్వహించిన పుష్పార్చనను వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పుష్పార్చన అనంతరం అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించారు.అమ్మవారికి సమర్పించిన పుష్పాలను భక్తులు, ఉభయదాతలకు ప్రసాదంగా పంపిణీ చేశారు. ఈ నెల 22వ తేదీన ప్రారంభమైన వసంత నవరాత్రోత్సవాలు శుక్రవారం ముగియనున్నాయి. శుక్రవారం ఉదయం పది గంటలకు మల్లేశ్వర స్వామి ఆలయం సమీపంలోని యాగశాలలో పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తి అవుతా యని ఆలయ అర్చకులు పేర్కొన్నారు.
