
కంకిపాడు(పెనమలూరు): పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం సమీపిస్తోంది. ఈ పరీక్షలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు విద్యాశాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. పరీక్ష కేంద్రాల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు ఎదురయ్యే అనారోగ్య సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంది. పరీక్ష కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని వైద్య, ఆరోగ్య శాఖ డెప్యూటేషన్‌పై నియమించింది. ఏప్రిల్ మూడో తేదీ నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి. కృష్ణాజిల్లాలో 143, ఎన్టీఆర్ జిల్లాలో 154 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. కృష్ణా జిల్లా ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రైవేటు పాఠశాలల్లో 19,935 మంది రెగ్యులర్, 2,501 మంది సప్లిమెంటరీ విద్యార్థులు, ఎన్టీఆర్ జిల్లాలో 27,329 మంది రెగ్యులర్, 2,808 మంది సప్లిమెంటరీ విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
297 కేంద్రాల్లో ప్రాథమిక చికిత్స కేంద్రాలు
వేసవి నేపథ్యంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఈ తరుణంలో పదో తరగతి విద్యార్థులు అనారోగ్య సమస్యలతో పరీక్షలకు దూరం కాకుండా ఉండేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ సమాచారంతో ఆయా పరీక్ష కేంద్రాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. ఆయా పీహెచ్‌సీలు, వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న వార్డు హెల్త్ సెక్ర టరీ/విలేజ్ హెల్త్ సెక్రటరీ, ఎంపీహెచ్‌ఏ మేల్/ఫీమేల్, రెండో ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలను ప్రథమ చికిత్స కేంద్రాల్లో డెప్యూటేషన్‌పై విధులు కేటాయించారు. ఒక్కో కేంద్రానికి వార్డు హెల్త్ సెక్రటరీ/విలేజ్ హెల్త్ సెక్రటరీ, ఎంపీహెచ్‌ఏ మేల్/ఫీమేల్, రెండో ఏఎన్‌ఎం (వీరిలో ఒకరు), మరొకరు ఆశా కార్యకర్త చొప్పున కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున, ఎన్టీఆర్ జిల్లాలో ఇద్దరు ఆశాకార్యకర్తలు, ఒక ఏఎన్‌ఎం చొప్పున సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.
గంట ముందునుంచే కేంద్రంలో..
పరీక్ష కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన ప్రథమ చికిత్స కేంద్రంలో కేటాయించిన వైద్య సిబ్బంది గంట ముందుగానే ఎగ్జామినేషన్ సెంటరు లైజిన్ ఆఫీసర్‌ను కలిసి విద్యార్థులకు అందుబాటులో ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీడీఓలు, మెడికల్ ఆఫీసర్లు, ఆయా కేంద్రాలను పర్యవేక్షిస్తూ డ్రగ్స్, మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉండేలా చూడాలి.
ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు ఉమ్మడి కృష్ణాజిల్లాలో 297 పరీక్ష కేంద్రాల ఏర్పాటు పరీక్ష కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స శిబిరాల ఏర్పాటుకు చర్యలు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి డెప్యూటేషన్ విధులు
విద్యార్థుల ఆరోగ్యం కోసం..
వేసవిలో ఎండలతీవ్రతకు విద్యార్థులు నీరసించే అవకాశం ఉంది. వాంతులు, జ్వరం, కడుపునొప్పి, పరీక్షల భయంతో కళ్లు తిరిగి పడిపోవటం, సీజనల్ వ్యాధులతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకూడదు. ప్రథమ చికిత్స కేంద్రాల్లో అన్ని రకాల మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతాం. సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ గీతాబాయి, డీఎంహెచ్‌ఓ, కృష్ణాజిల్లా
సమర్థంగా పరీక్షల నిర్వహణ
ఏప్రిల్ మూడో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 143 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశాం. వైద్య ఆరోగ్య శాఖ ఆయా కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. పరీక్ష కేంద్రానికి వచ్చిన తరువాత విద్యార్థి ఏ ఒక్క సమస్యతోనూ ఇబ్బంది పడ కుండా ప్రశాంతంగా పరీక్ష రాసేలా సమర్థంగా చర్యలు తీసుకుంటున్నాం.
– తాహెరా సుల్తానా, డీఈఓ, కృష్ణాజిల్లా

