మధురానగర్(విజయవాడసెంట్రల్): సర్వమానవాళి సంక్షేమం కోసం నిర్వహించిన కోటి రుద్రాక్షాభిషేకంలో ఉపయోగించిన రుద్రాక్షలతో సర్వ శుభాలు జరుగుతాయని ముత్యాలంపాడు శ్రీషిర్డీ సాయిబాబా మందిర గౌరవాధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి అన్నారు. మందిరంలో గురువారం కైంకర్యం చెల్లించిన భక్తులకు రుద్రాక్ష మాలలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి రుద్రాక్ష అభిషేకాన్ని విజయ వంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి ప్రతి పౌర్ణమికి బాబా మందిరంలో సాయి మహా హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మందిర అధ్యక్షుడు పొన్నలూరి లక్ష్మణరావు, కార్యదర్శి కుంచనపల్లి రవిశంకర్, కోశాధికారి మందలపర్తి సత్యశ్రీహరి తదితరులు పాల్గొన్నారు.