భద్రాచలం: భద్రాచలం టెంపుల్ ఇన్‌ఫర్మేషన్ (బీటీఐ) యాప్ సిద్ధమైంది. సుదూర ప్రాంతా ల భక్తులకు, యువతకు అరచేతిలో సమస్త సమాచారం అందించేలా రామాలయ ఈఓ ఎల్.రమాదేవి ఆధ్వర్యంలో ఆత్రేయ ఇన్‌ఫోటెక్ సిస్టం కంపెనీ యాప్‌ను రూపొందించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లకు ప్లే స్టోర్‌లో ఈ యాప్ లభ్యమవుతుండగా, బార్ కోడ్ స్కాన్ ద్వారా సైతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే వినియోగంలోకి తెచ్చినా శ్రీరామనవమి నాటికి అఽధికారికంగా ప్రారంభిస్తారు.
22 రకాల సేవలు..
ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్లే స్టోర్‌లో భద్రాచలం టెంపుల్ ఇన్‌ఫర్మేషన్ అని టైపు చేయగానే యాప్ డిస్‌ప్లే అవుతుంది. ఇన్‌స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం పేరిట మూలమూర్తుల ఫొటోతో పేజీ దర్శనమిస్తుంది. ఆలయ చరిత్ర ఆంగ్లంలో కనిపిస్తుంది. కింద కనిపించే సేవ అండ్ టైమింగ్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆన్‌లైన్ బుకింగ్ జాబితా పేరుతో ఆలయంలో నిత్యం అందే సేవలు, వేళల వివరాలు దర్శనమిస్తాయి. దేవస్థానంలో లభించే 22 రకాల సేవల వివరాలు పొందవచ్చు. ఇదేపేజీలో ఆలయం అంది స్తున్న సర్వీసులను, భక్తులు చేరుకునేందుకు గూగుల్ మ్యాప్‌ను అనుసంధానం చేశారు. భద్రాచలంలో ఉన్న అన్నదానం, కల్యాణ కట్ట, లడ్డూ కౌంటర్, పురుషోత్తపట్నం, ఆలయం వద్ద ఉన్న గోశాలలు, రామదాసు ధ్యాన మందిరం, ఆర్టీసీ బస్టాండ్, ఘాట్, ఎమర్జెన్సీ, ప్రచార రథం, ఇన్‌ఫర్మమేషన్ సెంటర్ (సీఆర్‌ఓ) శ్రీ సీతారామ కల్యాణ మండపం, పర్ణశాలలో పర్ణశాల, నార చీరల ప్రాంతాలు, నేలకొండపల్లి, కొత్తగూడెం రైల్వేస్టేషన్ వివరాలను పొందుపర్చారు. ఇదే పేజీలో ఎటపాకలో ఉన్న జటా యువు మండపం, భద్రాచలంలో ఉన్న ట్రైబల్ మ్యూజియం, అభయాంజనేయస్వామి ఆలయం, ఏపీలోని పాపికొండలు, శ్రీరామగిరి మ్యాప్‌లు అనుసంధానం చేశారు.
ఉపాలయాలు వివరాలు కూడా..
మరో పేజీలో శ్రీ సీతారాముల రామాయణ ఇతివృత్తాన్ని తెలుగులో ఉంచారు. ఆ తర్వాత ఉపాలయాల వివరాలను అందుబాటులో ఉంచారు. ఈ పేజీలో భద్రాచలంలో రామాలయానికి అనుబంధంగా ఉన్న ఆలయాలు, పర్యాటక ప్రాంతాల వివరాలను యాప్‌లో అందుబాటులో ఉంచారు.
‘బీటీఐ’ యాప్‌లో రామాలయ సమస్త సమాచారం
భక్తులకు అందుబాటులోకి తెచ్చిన ఆలయ అధికారులు
శ్రీసీతారామ చంద్రస్వామివారి పూజలు, సేవల వివరాలు లభ్యం
ఉపాలయాల వివరాలు, మార్గాలు కూడా అనుసంధానం
ఆలయ అధికారులను అభినందించిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్
‘స్మార్ట్’ రామయ్య!