● వేసవిలో డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ ● ఖమ్మం సర్కిల్ ఎస్‌ఈ శ్రీనివాసాచారి
నేలకొండపల్లి: వేసవిలో విద్యుత్ వినియోగం పెరగనున్నందున కోతలు లేకుండా, డిమాండ్‌కు తగి నట్లు సరఫరా చేయడమే తమ లక్ష్యమని ఎన్పీడీసీఎల్ ఖమ్మం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాసాచారి వెల్లడించారు. నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలాన్ని శనివారం పరిశీలించిన ఆయన నేలకొండపల్లిలో ఉద్యోగులతో సమావేశమయ్యారు. విని యోగదారులకు మర్యాద ఇవ్వడమే కాక వారి సమస్యలు సత్వరం పరిష్కరించాలని సూచించారు. అంతేకాక ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.
36 సబ్‌స్టేషన్ల ఇంటర్ లింక్
ఉద్యోగులతో సమీక్ష అనంతరం ఎస్‌ఈ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 36 విద్యుత్ సబ్‌స్టేషన్లకు ప్రత్యామ్నాయంగా సరఫరా కోసం ఇంటర్ లింక్ పనులు చేపడుతుండగా ఇప్పటికే 11చోట్ల పూర్తయ్యాయని చెప్పారు. అలాగే, కొత్తగా ఏడు సబ్‌స్టేషన్లు ఏర్పాటుచేయడంతో పాటు లోడ్‌కు అనుగుణంగా 767సబ్‌స్టేషన్లలో 250 చోట్ల అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి మొబైల్ వాహనాలు సమకూర్చామని, వినియోగదారులకు యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. కాగా, జిల్లాలో 2.54 లక్షల మందికి గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ అందుతోందని, ఇప్పటివరకు వీరు రూ.40.55కోట్ల సబ్సిడీ పొందారని ఎస్‌ఈ వెల్లడించారు. ఈసమావేశంలో డీఈఈలు చింతమళ్ల నాగేశ్వరరావు, హీరాలాల్, ఏఈలు కె.రామారావు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.