● జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ
కార్యదర్శి చంద్రశేఖర్ రావు
ఖమ్మంలీగల్: జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలో ఖాళీ పోస్టుల భర్తీకి ఈనెల 22న పరీక్షలు నిర్వహించనున్నట్లు సంస్థ కార్యదర్శి కె.వి. చంద్రశేఖర్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశామని, సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. స్టేనో/టైపిస్ట్ పరీక్ష ఉదయం 9 నుంచి ఉదయం 9.45 వరకు, టైపిస్ట్ కం అసిస్టెంట్ పరీక్ష ఉదయం 10.15 గంటల నుంచి ఉదయం 11 వరకు, జూనియర్ అసిస్టెంట్ పరీక్ష మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 వరకు, రికార్డు అసిస్టెంట్ పరీక్ష 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు https://khammam.dcourts.gov.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
31లోగా దరఖాస్తు చేసుకోండి
ఖమ్మంవన్‌టౌన్: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం రెండో దశకు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని పరిశ్రమల శాఖ జీఎం టి.సీతారాం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న వారికి నెలకు రూ.5 వేలు, 6 వేల చొప్పున చెల్లిస్తామని, 12 నెలల ఇంటర్న్‌షిప్ కాల వ్యవధిలో కనీసం 6 నెలలు ఉద్యోగ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ శిక్షణతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు 21 – 24 ఏళ్ల మధ్య వయసు ఉండాలని, వివరాలకు 1800 11 6090 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
‘లిఫ్ట్’ పనుల్లో
నాణ్యత లోపించొద్దు
● ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి
రఘునాథపాలెం : లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో నాణ్యత లోపించకుండా తగు జాగ్రత్తలు పాటించాలని జల వనరుల శాఖ ప్రభుత్వ సలహాదా రు పెంటారెడ్డి అధికారులకు సూచించారు. రఘునాథపాలెం మండలంలో రూ.66 కోట్ల అంచనాతో నిర్మిస్తున్న మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను బుధవారం ఆయన తనిఖీ చేశా రు. పంప్‌హౌస్, పైపులైన్ నిర్మాణం, మోటార్ల కొనుగోలు, సబ్‌స్టేషన్ నిర్మాణం తదితర పనులపై సమీక్షించి ఇంజనీర్లకు, కాంట్రాక్ట్ సంస్థకు సూచనలు చేశారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ ఎస్‌ఈ మంగళపుడి వెంకటేశ్వర్లు, ఈఈ అనన్య, డీఈ ఝాన్సీ పాల్గొన్నారు.
సబ్‌జైల్‌లో వరంగల్ రేంజ్ డీఐజీ విచారణ
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి సబ్‌జైల్‌లో రిమాండ్ ఖైదీ పెండ్ర రమేష్ పరారీ, పట్టుబడిన ఘటన నేపథ్యంలో జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ మాలారపు సంపత్ బుధవారం విచారణ చేపట్టారు. రిమాండ్ ఖైదీ పరారీ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరా తీశారు. జైలులో ఉన్న సీసీ పుటేజ్‌లను పరిశీలించారు. సబ్‌జైల్ బయట గోడకు ఆనుకొని ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. జైల్ ప్రాంగణమంతా కలియతిరిగి ఉద్యోగులు, ఖైదీలను విచారించారు. ఈ ఘటనపై త్వరలోనే శాఖా పరమైన చర్యలు ఉంటాయని చెప్పారు. ఆయన వెంట ఉమ్మడి ఖమ్మం జిల్లా సబ్‌జైళ్ల అధికారి జి.వెంకటేశ్వర్లు, సత్తుపల్లి జైల్ సూపరింటెండెంట్ ఎస్.ప్రవీణ్ ఉన్నారు.
కొనసాగుతున్న
ఐటీ తనిఖీలు !
ఖమ్మం సహకారనగర్ : శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఐటీ అధికారులు చేస్తున్న తనిఖీలు నగరంలో బుధవారం సైతం కొనసాగాయి. అడ్మిషన్లు, ఫీజుల వివరాలు, ఆర్థిక లావాదేవీలపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరించినట్లు తెలిసింది.
ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎంల బదిలీ
ఖమ్మంమయూరిసెంటర్ : టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లో డిప్యూటీ ఆర్‌ఎంలుగా విధులు నిర్వహిస్తున్న జి.ఎన్.పవిత్ర, భవానీ ప్రసాద్‌ను బదిలీ చేస్తూ సంస్థ వైస్ చైర్మన్, ఎండీ సజ్జనార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. భవానీ ప్రసాద్‌ను మహబూబ్‌నగర్‌కు, జి.ఎన్.పవిత్రను షాద్‌నగర్‌కు బదిలీ చేశారు. కాగా, వీరి స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.