భవితవ్యం.. నిక్షిప్తం | Sakshi
Sakshi News home page

భవితవ్యం.. నిక్షిప్తం

Published Wed, May 15 2024 12:35 AM

భవితవ

సాక్షిప్రతినిధి, ఖమ్మం: పార్లమెంట్‌ ఎన్నికల సంగ్రామం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 76.09 శాతం ఓటింగ్‌ నమోదైంది. సోమవారం పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిన అనంతరం ఈవీఎంలను ఖమ్మం రూరల్‌ మండలం పొన్నెకల్‌లోని శ్రీచైతన్య ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేశారు. జూన్‌ 4న జరిగే లెక్కింపుతో ఫలితం తేలనుంది. గెలుపోటములు తేలేందుకు 21 రోజుల సమయం ఉండడంతో అభ్యర్థుల నుంచి లోతైన విశ్లేషణ జరుగుతోంది. ఎక్కడ తమకు భారీగా ఓట్లు పోలయ్యాయి.. ఎక్కడ మైనస్‌లో ఉన్నామనే అంచనాల్లో మునిగారు. ఎవరి విశ్లేషణలు వారికి ఉన్నా.. గెలుపు తమదేననే ధీమా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు గెలుపోటములు అటుంచితే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి..? గెలిచే అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుందనే దానిపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పందేలు జోరందుకున్నాయి.

ఏం జరిగింది..?

ఖమ్మం పార్లమెంట్‌ ఎన్నికల్లో పోలింగ్‌ సరళిపై అభ్యర్థులు పోస్టుమార్టమ్‌ నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం మొత్తం పోలింగ్‌ రిపోర్టును తెప్పించుకున్న అభ్యర్థులు ముఖ్య నేతలతో కలిసి ఎక్కడెక్కడ ఎంతమేరకు పోలింగ్‌ నమోదైందనే దానిపై చర్చలు జరుపుతున్నారు. అలాగే పోలింగ్‌ ఏజెంట్లతో కూడా మాట్లాడి బూత్‌ల వారీగా నమోదైన ఓట్లు.. తమకు వచ్చిన ఓట్లపై ఆరా తీస్తున్నారు. అసెంబ్లీల వారీగా నమోదైన పోలింగ్‌ శాతం, అనుకూల, ప్రతికూల అంశాలపై అంచనాలు వేస్తున్నారు. ఆయా పార్టీల అధిష్టానాలు కూడా ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలో ఓటింగ్‌ సరళి ఎలా ఉందని తెలుసుకుంటున్నాయి. తమకు అనుకూలమైన ఓటింగ్‌ పడే డివిజన్లు, వార్డులు, కాలనీలు ఏవి..? అక్కడ ఎంత మేరకు పోలింగ్‌ జరిగింది, ఎక్కడ తక్కువ ఓట్లు వస్తాయి..? తదితర అంశాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు.

అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం..

ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గెలుపు తమదేనని ధీమాగా ఉన్నారు. పోలింగ్‌ అనంతరం తమకు అనుకూలమైన వాతావరణం ఉందనే భావన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గెలుపు తమదేనని పార్టీ నేతలు, నాయకులు, కేడర్‌ వద్ద చెబుతున్నారు. గెలుపు ఖాయమని, లక్ష నుంచి 1.50 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమనే అంచనాకు ఆ పార్టీ వచ్చినట్లు తెలుస్తోంది. ఆరు గ్యారంటీలు, ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు, కేడర్‌ ఉండటం, బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉండటం తమకు కలిసి వస్తాయనే ఆలోచనలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కూడా ఓటింగ్‌ సరళిని బట్టి చూస్తే తమకే అనుకూలంగా ఉందనే భావన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పర్యటనకు భారీ స్పందన రావడం, ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటుందనే ధీమా బీఆర్‌ఎస్‌ నేతల్లో ఉంది. ప్రధానంగా రైతులు, కార్మికులు తమకే ఓట్లు వేశారని విశ్లేషిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు తన గెలుపుపై లెక్కలు వేయడంలో మునిగారు. మోదీ మానియా, కేంద్ర ప్రభుత్వ పథకాలు తమకు అనుకూలమైన ఓటు పడేలా చేశాయనే ఉద్దేశంలో ఆయన ఉన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి అంశాలు తమకు కలిసి వస్తున్నాయని బీజేపీ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.

ఈ పోలింగ్‌ దేనికి సంకేతం..

గత పార్లమెంట్‌ ఎన్నికల్లో జరిగిన పోలింగ్‌ శాతంతో పరిశీలిస్తే ప్రస్తుత పోలింగ్‌ స్థిరంగా ఉంది. 2019 ఎన్నికల్లో 75.30 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. ఈసారి 76.09 శాతం మంది ఓటు వేశారు. గత ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా ఓటింగ్‌ శాతం పెరిగింది. 2009 ఎన్నికల్లో 82.08 శాతం, 2014 ఎన్నికల్లో 82.13 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆ రెండు ఎన్నికల కన్నా.. ఇప్పుడు పోలింగ్‌ శాతం కొంత తగ్గుముఖం పట్టింది. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు 5,67,459 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి. ఇక సీపీఎం అభ్యర్థి బోడా వెంకట్‌కు 57,102 ఓట్లు, బీజేపీ అభ్యర్థి దేవకి వాసుదేవరావుకు 20,488 ఓట్లు వచ్చాయి. ఈ సారి కూడా 76.09 శాతం పోలింగ్‌ జరగడంతోపాటు సీపీఎం కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఫలితాలపై విశ్లేషిస్తున్న కాంగ్రెస్‌ భారీ మెజార్టీ ఖాయమన్న ఆనందంలో ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేక ఓటు తమ విజయానికి నాంది అని బీఆర్‌ఎస్‌ చెబుతోంది. బీజేపీ కూడా ఇదే రీతిలో గెలుపుపై ఆశలు పెట్టుకుంది.

పోలింగ్‌ సరళిపై అభ్యర్థుల ఆరా

ఎక్కడెక్కడ అనుకూలంగా ఉందనే అంశంపై చర్చ

జూన్‌ 4న తేలనున్న ఫలితం..

గెలుపు తమదేనని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థుల ధీమా

అక్కడ ఎందుకు తగ్గింది..?

ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్‌ను విశ్లేషిస్తే.. ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గాల్లోనే తక్కువగా ఓటింగ్‌ నమోదైంది. ఖమ్మం నియోజకవర్గంలో 62.97 శాతం, కొత్తగూడెం నియోజకవర్గంలో 69.47 శాతం మంది ఓట్లు వేశారు. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో 80 శాతం పైగా పోలింగ్‌ నమోదు కావడంతో ఇక్కడ కలిసొచ్చేది ఎవరికి.. తగ్గిన చోట ఎవరికి నష్టమనే విశ్లేషణ జరుగుతోంది. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో వెనుక పడ్డామా..? అసలు ఎందుకు పోలింగ్‌ శాతం తగ్గిందనే కారణాలను అభ్యర్థులతోపాటు ఆ పార్టీల నేతలు అన్వేషిస్తున్నారు.

భవితవ్యం.. నిక్షిప్తం
1/1

భవితవ్యం.. నిక్షిప్తం

 
Advertisement
 
Advertisement