
వైభవంగా మారెమ్మ దేవి రథోత్సవం
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా మమదాపురలో మారెమ్మ దేవి రథోత్సవం వైభవంగా జరిగింది. మంగళవారం వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. మమదాపురలో వెలసిన అమ్మవారికి ప్రత్యేక పూజలను కిల్లే బృహన్మఠాధిప తి శాంతమల్ల శివాచార్య నెరవేర్చారు. రథోత్సవంలో రాయచూరు, మాన్వి, సింధనూరు, బళ్లారి తదితర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రాయచూరు విద్యార్థికి
వైద్య పట్టా ప్రదానం
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతంలో పుట్టిన రాయచూరు తాలూకా ఆశాపూర్‌కు చెందిన విశాల్ కుమార్ అనే విద్యార్థి ఐదేళ్ల ఎంబీబీఎస్ పదవి కోర్సులో ఉత్తీర్ణుడై డాక్టర్ పట్టాను అందుకున్నారు. మంగళవారం బెళగావి ప్రభుత్వ వైద్య కళాశాల సంస్థ పరిశోధన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కొప్పళ ప్రభుత్వ వైద్య కళాశాల సంస్థ పరిశోధన విభాగం డీన్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులతో కలిసి పట్టాను స్వీకరించారు. కాగా పల్లెల్లో ప్రాథమిక విద్యను, ఉన్నత విద్యను బెళగావిలో చదివిన విశాల్ కుమార్ వైద్య వృత్తిలో ఉన్నత శిఖరాలను అందుకోవాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.
పేద విద్యార్థులకు
ఉపకార వేతనాలు
హుబ్లీ: రోటరీ క్లబ్ ఆఫ్ హుబ్లీ, రోటరీ క్లబ్ ఆఫ్ హుబ్లీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో చేరిన ప్రతిభావంత పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించాలని నిర్ణయించారు. ఆర్థికంగా వెనుకబడిన హుబ్లీ నగర పరిధిలో నివసిస్తున్న పీయూసీ ఉత్తీర్ణులైన అర్హులైన విద్యార్థులు, ఇటీవల తీసిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, పీయూసీ మార్కుల జాబితా, ఆధార్ కార్డులతో స్వయంగా రోటరీ క్లబ్ ఆఫ్ హుబ్లీ అంబికా అప్లయన్సెస్, లోయర్ గ్రౌండ్ ఫ్లోర్, కలబుర్గి ప్లాటినం, హుబ్లీ అనే చిరునామాలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. దరఖాస్తుల అందజేతకు ఆఖరి తేదీ ఈ నెల 25 అని ట్రస్ట్ అధ్యక్షుడు సీఏ డాక్టర్ చరంతి మఠ ఓ ప్రకటనలో తెలిపారు.
ముంగారు ఉత్సవాలకు ఆహ్వానం
రాయచూరు రూరల్: నగరంలో జూన్ నెలలో ఐదు రోజుల పాటు జరిగే ముంగారు ఉత్సవాలకు మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి ఆహ్వానించారు. జూన్ 8 నుంచి 12 వరకు ముంగారు మున్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో చేపట్టే ముంగారు సాంస్కృతిక ఉత్సవాలను చేపట్టడానికి సమాజం సిద్ధంగా ఉందని తెలిపారు. ముంగారు సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభమై 25 ఏళ్లు కానున్న సందర్భంగా ఉత్సవాలకు హాజరు కావాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం పలికారు.
తాగునీటి ఎద్దడి రానీయొద్దు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో తాగునీటి ఎద్దడి రానీయకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధికారులకు సూచించారు. మంగళవారం వికాససౌధలో జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో సీఎం మాట్లాడారు. రాయచూరు, బళ్లారి, కలబుర్గి, యాదగిరి, కొప్పళ, బీదర్, విజయనగర జిల్లాల్లో వేసవిలో రెండు నెలల పాటు ప్రజలకు తాగునీటి ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. నీటి సౌకర్యాలు లేని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరందించాలన్నారు. జల జీవన్ మిషన్, జలధార పథకాలను సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు.

వైభవంగా మారెమ్మ దేవి రథోత్సవం

వైభవంగా మారెమ్మ దేవి రథోత్సవం

వైభవంగా మారెమ్మ దేవి రథోత్సవం